ఆంగ్ల మాధ్యమమే మంచిదనే భ్రమలొద్దు

www.mannamweb.com


రాష్ట్రంలో 40 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండడం దురదృష్టకరంకర్నూలులో ఎస్టీయూ వజ్రోత్సవాల్లో సుప్రీంకోర్టు విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
కర్నూలు: రాష్ట్రంలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తన దృష్టికి తెచ్చారని, ఇది దురదృష్టకరమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలులోని ఎగ్జిబిషన్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) వజ్రోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఐదో తరగతి చదివేవారిలో సగానికి సగం మంది రెండంకెల కూడికలు, తీసివేతలు చేయలేకపోతున్నారని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మాతృభాషలో బోధించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు.

‘పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదివితేనే బాగుపడతారని, ఇతర దేశాలకు వెళతారని, డాలర్లు వస్తాయన్న భ్రమల్లో ఉన్నారు. అది చాలా తప్పు’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర శాఖల ఉద్యోగులతో పోలిస్తే ఉపాధ్యాయుల స్థాయిగానీ, జీతభత్యాలుగానీ సరిపడా లేవని ఆయన పేర్కొన్నారు. ‘పోటీ తట్టుకోలేక, సీట్లు రాలేవన్న ఆవేదనతో కొందరు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల్ని కనేది చంపడానికా?’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నవారు బాధ్యతగా ప్రవర్తిస్తున్నారని, సమాజం గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి రాలేకపోయారని.. ప్రభుత్వ ప్రతినిధులు ఎవరైనా వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎస్టీయూ ఉద్యమపథాన్ని ప్రశంసించారు.

పాలకులు వారి వర్గ స్వభావానికి అనుగుణంగా విద్యా విధానాలు తయారుచేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజ్యాంగ, లౌకికవాద స్ఫూర్తికి భిన్నంగా రామాయణం, భారతం, భాగవతం బోధించాలని పాలకులు చెబుతున్నారని.. ఇదేంటని అడిగితే పిల్లల్లో దేశభక్తి లేక విదేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొంటున్నారని వాపోయారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ విద్యావిధానం భ్రష్టు పట్టిపోయేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు.ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారకుండా విద్యారంగాన్ని ఒక స్వతంత్ర వ్యవస్థగా మార్చాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వేదికపై ఎస్టీయూ వజ్రోత్సవ సావనీర్‌, ఉపాధ్యాయవాణి ప్రత్యేక సంచిక, వజ్రోత్సవ లోగోను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, అతిథులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ నేత చాడ వెంకటరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, అన్ని జిల్లాలనుంచి పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.