ఈ కీబోర్డుల యుగంలో టకటకా టైపు చేసేస్తున్న రోజులలో చేతిరాతకు ప్రాధాన్యం ఉందా? అయితే ఆ చేతిరాత డాక్టర్లది అయితే ప్రాధాన్యం ఉందనే అంటున్నాయి భారతీయ న్యాయస్థానాలు.
కేవలం మందులషాపుల వాళ్లు మాత్రమే అర్థం చేసుకోగలిగే డాక్టర్ల చేతిరాత చుట్టూ అనేక జోకులు పేలుతుండటం ఇండియానేలోనే కాదు, ప్రపంచమంతటా ఉంది.
స్పష్టంగా చదవదగిన ప్రిస్క్రిప్షన్ ఎంత ముఖ్యమో నొక్కిచెప్పే తాజా ఉత్తర్వులను ఇటీవల పంజాబ్, హరియాణా హైకోర్టు వెలువరించింది.
”మందుల చీటి స్పష్టంగా చదవగలిగేలా ఉండటం ఓ ప్రాథమిక హక్కు” అని కోర్టు పేర్కొంది. ఇది జీవితానికి, మరణానికి వ్యత్యాసాన్ని చూపుతుందని తెలిపింది.
నిజానికి ఈ ఉత్తర్వులు చేతిరాతకు సంబంధం లేని కేసులో వెలువడ్డాయి. అత్యాచారం, మోసం, ఫోర్జరీపై ఓ మహిళ వేసిన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను జస్టిస్ జస్గుప్రీత్ సింగ్ పురి పరిశీలించారు.
తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని నమ్మించి, తన నుంచి డబ్బు తీసుకున్నారని, నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించారని, తనపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించారు.
అయితే నిందితుడు ఈ ఆరోపణలను ఖండించారు. తామిద్దరి మధ్య సమ్మతితో కూడిన సంబంధం ఉందని, కేవలం డబ్బు కారణంగా ఏర్పడిన వివాదంతో ఆమె ఈ కేసువేశారని వాదించారు.
మహిళను పరీక్షించిన ప్రభుత్వ వైద్యుడు రాసిన మెడికో లీగల్ నివేదికను చూస్తే ఏమీ అర్థం కాలేదని జస్టిస్ పూరి అన్నారు.
”ఒక్క పదమైనా, అక్షరమైనా చదవగలిగే స్థితిలో లేకపోవడం కోర్టును కలచివేసింది” అని ఆయన తన ఉత్తర్వులలో రాశారు.
ఈ తీర్పు కాపీని బీబీసీ చూసింది. అందులో నివేదికతోపాటు రెండు పేజీల ప్రిస్క్రిప్షన్ ఉంది. డాక్టర్ రాసిన ఆ ప్రిస్క్రిప్షన్ అర్థంకాకుండా గందరగోళంగా ఉంది.
“సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్లు సులభంగా అందుబాటులో ఉన్న సమయంలో, ప్రభుత్వ వైద్యులు ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్లను చేతితో రాయడం ఆశ్చర్యకరం, బహుశా కొంతమంది కెమిస్టులు తప్ప ఎవరూ వాటిని చదవలేరు” అని జస్టిస్ పూరి రాశారు.
మెడికల్ కాలేజీల పాఠ్యప్రణాళికలో చేతిరాత పాఠాలు చేర్చాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
అలాగే, డిజిటల్ ప్రిస్క్రిప్షన్లను అమలు చేసే కార్యక్రమానికి రెండు సంవత్సరాల గడువును నిర్ణయించింది.
‘‘పరిష్కారానికి సాయపడతాం’’
ఈ సమస్య పరిష్కారానికి సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని 3,30,000 మందికి పైగా వైద్యులు సభ్యులుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలి బీబీసీకి చెప్పారు.
నగరాలు ,పెద్ద పట్టణాలలో డాక్టర్లు డిజిటల్ ప్రిస్క్రిప్షన్లకు మారారు, కానీ గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలో స్పష్టమైన ప్రిస్క్రిప్షన్లను పొందడం చాలా కష్టం.
“చాలా మంది వైద్యుల చేతిరాత సరిగా ఉండదనే విషయం అందరికీ తెలిసిన నిజమే. నిజానికి వైద్యులు ఎంతో బిజీగా ఉంటారు. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో” అని ఆయన చెప్పారు.
“ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని, రోగులు, మందులషాపుల వాళ్లు చదవగలిగే పెద్ద అక్షరాలతో ప్రిస్క్రిప్షన్లను రాయాలని మేం మా సభ్యులకు సిఫార్సు చేశాం. . రోజుకు ఏడుగురు రోగులను చూసే వైద్యుడు దీన్ని చేయగలడు, కానీ రోజుకు 70 మంది రోగులను చూసే డాక్టరు దీనిని చేయలేడు” అని ఆయన చెప్పారు.
కోర్టుల ఆక్షేపణ ఇదే మొదటిసారి కాదు
డాక్టర్ల చేతిరాతను కోర్టులు ఆక్షేపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఒడిశా హైకోర్టు “జిగ్‌జాగ్ రాత శైలి”పై అభ్యంతరం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు అయితే, “ఇంత చెత్తగా రాసిన రిపోర్టులు చదవడం అసాధ్యమే” అని వ్యాఖ్యానిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే డాక్టర్ల చేతిరాత ఇతరుల చేతిరాతకంటే దారుణంగా ఉంటుందని ఏ పరిశోధనా నిరూపించలేదు.
డాక్టర్లు చేతి రాత అందానికి సంబంధించిన సమస్య కాదని, తప్పుడు అర్థాలకు దారితీసే ప్రిస్క్రిప్షన్ విషాదకర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ (ఐఓఎం) 1999 నివేదిక ప్రకారం, వైద్యపరమైన లోపాలు యుఎస్‌లో ఏటా కనీసం 44,000 నివారించదగిన మరణాలకు కారణమయ్యాయి, వీటిలో 7,000 అర్థం కాని చేతిరాత కారణంగానే ఉన్నాయి.
ఇటీవలి ఉదంతంలో స్కాట్లాండ్‌లో పొడిబారిన కంటి చికిత్స కోసం ఒక మహిళకు పొరపాటుగా అంగస్థంభన క్రీమ్ ఇచ్చారు. దాని వల్ల ఆమెకు కెమికల్ రియాక్షన్ గాయాలు అయ్యాయి.
ఔషధ లోపాలు భయంకరమైన స్థాయిలో హాని, మరణాలకు కారణమయ్యాయి” అని యూకేలోని వైద్యాధికారులు అంగీకరించారు.
“మరిన్ని ఆసుపత్రులలో ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ సిస్టమ్స్ ను ప్రారంభించడం వల్ల 50% లోపాలను తగ్గించవచ్చు” అని తెలిపారు.
పేలవమైన చేతిరాత వల్ల కలిగే హానిపై భారతదేశంలో బలమైన సమాచారం లేదు, కానీ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంలో గతంలో ప్రిస్క్రిప్షన్లను తప్పుగా చదవడం వల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, అనేక మరణాలు సంభవించాయి.
పిల్ వేసిన పరమాత్మ
ఓ కేసులో నొప్పి నివారణ మందు సూచిస్తే, అదే తరహాలో వినిపించే డాయబెటిస్ మందు తీసుకోవడంతో ఓ మహిళా రోగి ఇబ్బంది పడిన ఘటన మీడియాలో విస్తృతంగా రిపోర్టు అయింది.
తెలంగాణలోని నల్గొండలో ఫార్మసీ నడుపుతున్న చిలుకూరి పరమాత్మ బీబీసీతో మాట్లాడుతూ, 2014లో నోయిడా నగరంలో జ్వరం కోసం తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మరణించిన మూడేళ్ల చిన్నారి గురించి వార్త చదివిన తర్వాత హైదరాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు.
చేతితో రాసిన ప్రిస్క్రిప్షన్లను పూర్తిగా నిషేధించాలని కోరుతూ ఆయన చేసిన ప్రచారం ఫలితంగా 2016లో, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా “ప్రతి వైద్యుడు జనరిక్ పేర్లతో ఉన్న మందులను స్పష్టంగా, ప్రాధాన్యంగా పెద్ద అక్షరాలలో సూచించాలి” అని ఆదేశించింది.
2020లో, భారత ఆరోగ్య సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే పార్లమెంటులో మాట్లాడుతూ, ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వైద్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలలోని వైద్య అధికారులకు సూచించారు.
ఈ ఆదేశాలు జారీచేసి దశాబ్దం దాటినప్పటికీ, ఇప్పటికీ కూడా అర్థంకాకుండా రాసిన ప్రిస్క్రిప్షన్లు తమ దుకాణాలకు వస్తూనే ఉన్నాయని చిలుకూరి పరమాత్మతోపాటు ఇతర ఫార్మాసిస్ట్‌లు చెబుతున్నారు. చిలుకూరి కొన్నేళ్లుగా తాను చూసిన అనేక ప్రిస్క్రిప్షన్‌లను బీబీసీకి పంపారు. వాటిని ఆయన కూడా అర్థం చేసుకోలేకపోయారు.
కోల్‌కతా నగరంలోని అత్యంత ప్రసిద్ధ ఫార్మసీలలో ఒకటైన ధన్వంతరి పశ్చిమ బెంగాల్‌లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలను కలుపుకొని 28 శాఖలను కలిగి ఉంది. ధన్వంతరి ప్రతిరోజూ 4,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందిస్తోంది. కొన్నిసార్లు వారికి వచ్చే ప్రిస్క్రిప్షన్లు చదవలేని విధంగా ఉంటాయి.
“కొన్నేళ్లుగా నగరాల్లో చేతితో రాసిన ప్రిస్క్రిప్షన్ల నుంచి ముద్రించిన ప్రిస్క్రిప్షన్లకు మారడాన్ని మేం చూశాం. కానీ శివారు, గ్రామీణ ప్రాంతాల్లో, ఇప్పటికీ చాలా వరకుచేతితో రాసినవే.” అని ధన్వంతరి సీఈఓ రవీంద్ర ఖండేల్వాల్ అన్నారు.
తన సిబ్బంది చాలా అనుభవజ్ఞులని, కస్టమర్లకు సరైన ఔషధం లభించేలా చూస్తారని, డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్లను వారిలో చాలా మంది అర్థం చేసుకోగలరని ఆయన చెప్పారు.
“అయినప్పటికీ, కొన్నిసార్లు మేం వైద్యులకు కాల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సరైన మందు ఇవ్వడం మాకు చాలా ముఖ్యం.” అని రవీంద్ర ఖండేల్వాల్ అన్నారు.
































