Soaked Fenugreek Water: మెంతులు నానబెట్టిన నీటిని ఇలా తాగండి.. మీ శరీరంలో ఊహించని అద్భుతాలు

Soaked Fenugreek Water: మెంతులు నానబెట్టిన నీటిని ఖాళీ కడుపుతో తాగితే.. 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..


మనం వివిధ వంటకాల్లో జీలకర్ర, ఆవాలు, మిరియాలు, లవంగాల వంటి రకరకాల దినుసులను వాడుతుంటాం.

ఈ వంట దినుసుల్లో మెంతులు (Fenugreek seeds) కూడా ప్రధానంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు. మెంతులు రక్తాన్ని పలుచన చేసి రక్తప్రసరణ మెరుగుపరస్తాయి. కీళ్ల నొప్పుల్ని దూరం చేసే శక్తి వీటికి ఉంది. అలానే మూత్రనాళ, శ్వాస సంబంధిత రుగ్మతలను పోగొడతాయి. అయితే ఈ మెంతులను నానబెట్టి (Soaked Fenugreek Seeds) నీటితో తీసుకుంటే ఐదు ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట గోరువెచ్చని నీటిలో మెంతులను నానబెట్టి.. ఆ మిశ్రమాన్ని ఖాళీ కడుపుతో తాగితే 5 అద్భుతమైన ప్రయోజనాలు పొందొచ్చని అంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

జీర్ణక్రియకు ఎంతో మేలు

మెంతులు సహజమైన యాంటాసిడ్‌గా పనిచేస్తూ జీర్ణక్రియలో దోహదపడతాయి. ఎసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ వంటి అజీర్తి సమస్యలతో సతమతమవుతున్న వారు ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతుల నీటిని తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. వర్షాకాలం, చలికాలంలో నానబెట్టిన మెంతుల నీటిని తీసుకోవడం మంచిది. అయితే ఈ డ్రింక్ ఒంట్లో వేడిని పెంచుతుంది కాబట్టి వేసవి కాలంలో తీసుకోకూడదు.

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్

మెంతుల నీటిని తీసుకుంటే శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. మెంతుల్లో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్స్‌ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడేవారు రోజూ ఈ హెల్తీ డ్రింక్‌ను తీసుకుంటూ మంచి ప్రయోజనాలను పొందొచ్చు.

నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం

మెంతుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ లక్షణాలు నెలసరి నొప్పులతో సహా ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మెంతుల నీటిలో ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల పీరియడ్ సమయంలో నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి.

బరువు తగ్గేందుకు దోహదం

మెంతులు బరువు తగ్గడంలోనూ దోహదం చేస్తాయి. మెంతులను తరచూ తీసుకుంటే జీర్ణక్రియ శక్తి పెరుగుతుంది. డైటింగ్ చేస్తున్న వారు మెంతుల నీటిని ఖాళీ కడుపుతో డిటాక్స్ డ్రింక్‌గా తీసుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

జుట్టు, చర్మ ఆరోగ్యానికి మంచిది

మెంతులలో డయోస్జెనిన్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉండేలా సహాయపడతాయి.

*మెంతులు ఎలా నానబెట్టాలి..?

రాత్రిపూట ఒక ఫ్లాస్క్‌లో 1 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయాలి. ఈ ఫ్లాస్క్‌లో 1 గ్లాసు వేడినీరు పోయాలి. గట్టిగా మూత పెట్టి మెంతులను రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే లేచి ముందుగా ఆ నీరు తాగాలి. తర్వాత మెంతులను నమిలి మింగాలి. మెంతులు బాగా చేదుగా ఉన్నాయనుకుంటే.. ఆ మిశ్రమాన్ని వడగట్టి ఆ నీటిని మాత్రమే తాగవచ్చు. లేదంటే పెనం మీద మెంతులను కాస్త వేడి చేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పొడిని 1 టీస్పూన్ గోరువెచ్చని నీటిలో కలిపి పొద్దున్నే తాగవచ్చు.