పోలీసుల చేతికి డ్రగ్ టెస్టింగ్ కిట్స్.. గంజాయి సేవిస్తే.. ఇట్టే పట్టేస్తారు

www.mannamweb.com


గత కొన్నేళ్లుగా డ్రగ్స్, గంజాయి వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా గంజాయి దొరకుతుంది. అయితే ఇక నుంచి గంజాయి తాగేవారు పోలీసుల నుంచి తప్పించుకోలేరు.

కాప్స్ చేతికి ఆయుధాలు చిక్కాయి. దీంతో గంజాయి, డ్రగ్స్‌ను సమూలంగా అరికట్టేలా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దూకుడు పెంచారు. గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ బ్రీత్ అనలైజర్ టెస్ట్ మాదిరిగా గంజాయి టెస్టింగ్ కిట్‌లను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. తొలి రోజే 8 మందిపై గంజాయి కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…. అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, సిరిసిల్ల టౌన్ సి.ఐ లతో కలసి గంజాయి టెస్టింగ్ కిట్లను ఆవిష్కరించారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడాని ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్‌లు, స్నిపర్ డాగ్స్‌తో తనిఖీలు చేపడుతూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. మత్తు పదార్థాలను అక్రమ రవాణాకు చెక్ పెడుతూ గంజాయిని పట్టుకుంటున్నారే గాని.. వాటిని సేవించే వారిని గుర్తించడం కష్టంగా మారిందని… అందుకే గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. జిల్లాలో గంజాయి సేవించేవారు ఇకనుంచి పోలీసుల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.