Dry Ice: గురుగ్రామ్‌లో డ్రై ఐస్ తిని ఐదుగురు అనారోగ్యం పాలయ్యారు. గురుగ్రామ్‌లో ఒక రెస్టారెంట్లో ఈ దురదృష్ట ఘటన జరిగింది. రెస్టారెంట్లోని ఒక వ్యక్తి మౌత్ ఫ్రెషనర్ అనుకొని డ్రై ఐస్ కస్టమర్లకు ఇచ్చారు.
అది తిన్న వారి నాలుకపై కోతలు పడ్డాయి. విపరీతంగా మంటతో వాళ్ళు అరిచారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ వాళ్ళు మౌత్ ఫ్రెషనర్ అని చెప్పి డ్రై ఐస్ ఇచ్చినట్టు సమాచారం.
డ్రై ఐస్ అంటే ఏమిటి?
డ్రై ఐస్ అంటే ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ద్రవ దశ నుండి ఘనస్థితికి చేరుకుంటుంది. -మైనస్ 78.5 సెంటీగ్రేడ్ వద్ద ఉన్న ఘన కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఇలా కార్బన్ డయాక్సైడ్ మార్చడాన్ని సబ్లిమేషన్ అంటారు. ఇలా ఘన రూపంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను షిప్పింగ్ లో వినియోగిస్తారు. షిప్పింగ్ లో ఉత్పత్తులు పాడవకుండా భద్రపరచడం కోసం దీన్ని వినియోగిస్తారు.
డ్రై ఐస్ చేత్తో పట్టుకుంటే చేతికి గాయాలు అవుతాయి. కాలిన గాయాల్లాగా అవి ఉంటాయి. ఇక ఈ డ్రై ఐస్‌ను తింటే నోరంతా కాలిపోతుంది. ఊపిరి కూడా ఆడక ఇబ్బంది పడతారు. ముట్టుకునేటప్పుడు చేతికి గ్లౌవ్స్ వేసుకోవడం చాలా అవసరం. అలాగే తగినంత వెంటిలేషన్ ఉన్నప్పుడే వాటిని ఓపెన్ చేయాలి. లేకపోతే డ్రై ఐస్ వల్ల చాలా చెడు ప్రభావం పడుతుంది.
డ్రై ఐస్ అనుకోకుండా తింటే అది ప్రాణాంతకమైన పరిస్థితులకు దారితీస్తుంది. తీవ్రమైన అంతర్గత గాయాలకు కారణం అవుతుంది. నోటిలో లేదా జీర్ణవ్యవస్థలో పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ప్రమాదకరమైన గ్యాస్ ఏర్పడుతుంది. కడుపుబ్బరం పొత్తి కడుపునొప్పి, వాంతులు, పేగులు చిల్లులు పడడం, పొట్టకు చిల్లులు పడడం వంటివి జరుగుతాయి. ఊపిరాడని పరిస్థితి తలెత్తుతుంది. డ్రై ఐస్ పొరపాటున నోట్లో పెట్టుకుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు ఇలాంటివి అందుబాటులో లేకుండా చూసుకోండి.
డ్రై ఐస్‌ను తొలిసారి 1800ల కాలంలోనే కనుగొన్నారు. 1920లో దీన్ని వాణిజ్య ఉత్పత్తులకు వినియోగించడం ప్రారంభించారు. ముఖ్యంగా ఆహారం, ఔషధ పరిశ్రమల్లోని ఉత్పత్తులను షిప్పింగ్ చేయడానికి, ఆ పదార్థాలు పాడవకుండా ఉండేందుకు ఈ డ్రై ఐస్ ను వినియోగించడం మొదలుపెట్టారు. అలాగే కొన్ని రకాల వ్యాక్సిన్లను షిప్పింగ్ చేసేటప్పుడు కూడా ఆ వ్యాక్సిన్ లకు చుట్టూ కూల్ గా ఉంచేందుకు ఈ డ్రై ఐస్ ని వినియోగిస్తారు. డ్రై ఐస్ పెద్దపెద్ద ముక్కలుగానే కాదు, చిన్న చిన్న గుళికల రూపంలో ఉంటుంది. కాబట్టి పిల్లలకు దగ్గరలో ఉంచకూడదు. ఇది చర్మానికి తీవ్రమైన హానిని కలగజేస్తుంది.