ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల అనేక మంది సర్టిఫికెట్లు తడిపి పాడై పోయాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు అవసరమైన ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్, డీ.ఈఎల్, ఈడీ, టీటీసీ వంటి తదితర ముఖ్యమైన ధ్రువపత్రాలు వరదల్లో పాడైపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
ఇటువంటి వారికి కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న అభ్యరులు డూప్లికేట్ పత్రాలు పొందొచ్చని ప్రకటించింది. ఇందు కోసం అక్టోబరు 12వ తేదీలోపు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు తెలిపారు.
దరఖాస్తుదారుడి చిరునామాతో పాటు సొంత డిక్లరేషన్, ఆధార్ కార్డు జెరాక్స్ (నివాసం చిరునామా కోసం), కావాల్సిన ధ్రువపత్రాల నకళ్ల కాపీ (ఉంటేనే)ని జిల్లా విద్యాశాఖాధికారి పేరుతో పెట్టుకున్న దరఖాస్తులను సంబంధింత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేయాలని కోరారు. అంటే సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారంతా తమ ఊరి పరిధిలోని పాఠశాలల్లోని ప్రధాన ఉపాధ్యాయులకు డూప్లికెట్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అవి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరుతాయి. అక్కడి అధికారులు పరిశీలించి సంబంధిత బోర్డుల నుంచి డూప్లికెట్ సర్టిఫికెట్లను అభ్యర్ధులకు అందజేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
అక్టోబరు 15తో ముగుస్తున్న ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తు గడువు
విద్యారులు ఎన్‌ఎంఎంఎస్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవటానికి అక్టోబరు 15 వరకు గడువు ఉందని బందరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బీ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. 2023, 22, 21, 20 సంవత్సరాల్లో ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయిన విద్యారులు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. కొత్త అభ్యరులు, రెన్యువల్ చేసుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తుది గడువు పొడిగింపు ఉండదని తెలిపారు.