సంక్రాంతి వేళ.. స్లీపర్ బస్సులకు కేంద్రం బిగ్ షాక్

స్లీపర్ కోచ్ బస్సులు మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా అవి ప్రమాదాలకు గురి అవుతున్నాయి. ఒక్కసారి మంటలు అంటుకుంటే కాలి బూడిద అయ్యేంత వరకూ అవి శాంతించే పరిస్థితులు లేవు.


మొన్నటి కర్నూలు మొదలుకుని కర్ణాటక వరకూ ఇటువంటి ఎన్నో దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటోన్నాయి. పదుల సంఖ్యలో ప్రయాణికులు సజీవంగా దహనమౌతున్నారు. అకాలమరణాల బారిన పడుతున్నారు.

గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా స్లీపర్ కోచ్ బస్సులు అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ఇకపై స్లీపర్ కోచ్ బస్సులను కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే- ఇప్పుడు అందుబాటులో ఉంటోన్న స్లీపర్ కోచ్ బస్సులు కూడా తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, దీనికి అవసరమైన ప్రతి ఒక్క పరికరాన్ని కూడా ప్రయాణికులకు సమకూర్చాలని నితిన్ గడ్కరీ ఆదేశించారు.

అగ్నిప్రమాదాలను గుర్తించే వ్యవస్థ, అత్యవసర లైటింగ్, డ్రైవర్ నిద్రమత్తు ఇండికేటర్లు ప్రతి స్లీపర్ బస్సులోనూ అమర్చాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ను సత్వరమే గుర్తించేలా మార్కింగ్ చేయడం, అద్దాలను పగులగొట్టడానికి అవసరమైన సుత్తులు ప్రతి సీట్ కూ అందుబాటులో ఉంచడాన్ని తప్పనిసరి చేసినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. మాన్యువల్ బస్ బాడీ బిల్డర్లకు సెల్ఫ్ సర్టిఫైడ్ అనుమతిచ్చిన రాష్ట్ర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వాలకు లేఖ రాశానని ఆయన తెలిపారు.

మండే స్వభావం గల వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ తరలించడానికి అనుమతి లేదని ఆయన పునరుద్ఘాటించారు. అటువంటి వస్తువులు తరలించిన బస్సు యజమానులపై చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాత్/ గ్యాంగ్ వే ఇరుకుగా లేకుండా చూసేలా ఇకపై స్లీపర్ కోచ్ బస్సులను డిజైన్ చేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం/పనిచేయకపోవడం, అగ్నిమాపక పరికరాలు పూర్తిగా కొరవడటం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన శిక్షణ లేని సిబ్బంది వంటి లోపాలు ఉన్నట్లు గర్తించింది కేంద్రం.

స్లీపర్ కోచ్ బస్సులు ఏఐఎస్-052 బస్ బాడీ కోడ్‌కు కట్టుబడి ఉండాలి. ఇది బస్ నిర్మాణం, డిజైన్, భద్రతా అవసరాలను నిర్దేశించే తప్పనిసరి చేసే నిబంధన. దేశంలో నిర్మించే అన్ని బస్ బాడీలు ఉన్నత స్థాయి ప్రయాణికుల రక్షణను అందించడానికి ఈ కోడ్ కీలకమైనది. స్లీపర్ కోచ్ బస్సులను ఇంతకుముందు అసంఘటితంగా ఉన్న తయారీ రంగాన్ని నియంత్రించడానికి ఈ ప్రమాణం పరిధిలోకి తీసుకువచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.