దువ్వాడ ఇంటి గుట్టు కథా చిత్రమ్‌లో మరో ట్విస్ట్.. రాత్రికి రాత్రే మారిన సీన్.

www.mannamweb.com


ఇంట్లో దువ్వాడ. బయట కారు షెడ్‌లో ధర్నా ప్రోగ్రామ్‌లో వాణి బైఠాయించారు. అది నిన్నటి దాకా ఇల్లు. అయితే రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. ఇంటి చుట్టూ ఫ్లెక్సీలు వెలిశాయి. క్యాంప్‌ ఆఫీసు అంటూ సైన్ బోర్డులు దర్శనమిచ్చాయి. అదనంగా మరికొందరు ఇంట్లోకి దూరారు. బయట కారు షెడ్‌లో దువ్వాడ భార్య వాణి ధర్నా చేస్తోంది. అలసిపోయినప్పుడు దోమ తెరల కింద రెస్ట్‌ తీసుకుంటున్నారు. ఇక దువ్వాడతోపాటు ఇంట్లో నలుగురు ఉన్నారు? ఎవరా నలుగురు? అన్నదీ ఆసక్తికరంగా మారింది.

టెక్కలిలోని MLC దువ్వాడ శ్రీనివాస్ నివాసం….గత 2 వారాలుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దువ్వాడ, వాణి, మాధురి.. ఇంటి గుట్టు-ఇంటి చుట్టూ కథా చిత్రమ్‌లో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు MLC నివాసంగా ఉన్న భవనం నేడు MLC క్యాంపు కార్యాలయoగా మారిపోయింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం, టెక్కలి నియోజకవర్గం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ క్యాంప్‌ ఆఫీస్‌ అంటూ గోడలకు ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో దువ్వాడ ఇల్లు కాస్తా…క్యాంప్‌ ఆఫీసుగా మారిపోయింది.
ఇంట్లోకి వెళ్లేందుకు వాణి ప్రయత్నం..!

గత రెండు వారాలుగా తనను, కుమార్తెలను ఇంట్లోకి అనుమతించాలంటూ దువ్వాడ ఇంటి ముందు వాణి ధర్నా చేస్తున్నారు. దువ్వాడ, వాణి, మాధురి మధ్య ఇంటి పంచాయితీ ఎంతకీ తెగకపోగా ఇది రకరకాల మలుపులు తిరుగుతోంది. తన డబ్బుతోనే దువ్వాడ స్థలం కొని ఇల్లు కట్టారని వాణి ఆరోపిస్తుంటే…ఆ ఇల్లు తప్ప ఇంకేదైనా అడగాలంటున్నారు దువ్వాడ. ఇక ఇంటి నిర్మాణం కోసం దువ్వాడ తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ చెక్కులు చూపిస్తూ హల్చల్‌ చేశారు మాధురి. ఇక తన దగ్గర స్థలం కొన్న దువ్వాడ ఇంకా 60 లక్షలు ఇవ్వాలంటూ పార్వతీశం అనే కేరక్టర్‌ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో పతి పత్ని ఔర్‌ ఓగా మొదలైన గొడవ, ఇప్పుడు ఇంటి పంచాయితీగా మారిపోయింది

ఇంట్లో దువ్వాడ..బయట వాణి మోహరింపు

ఇంట్లోకి అనుమతించాలంటూ వాణి డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో…దువ్వాడ నివాసం కాస్తా ఇప్పుడు ఆయన క్యాంప్‌ కార్యాలయంగా మారిపోయింది. . ఇంట్లో అడుగు పెట్టాలని వాణి, ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలని దువ్వాడ ప్రయత్నిస్తున్నారు. ఇంటి బయట మోహరించిన వాణి సైన్యం, ఇంటి లోపల తలుపులు బిడాయించుకుని కూర్చున్న దువ్వాడ శ్రీనివాస్‌ బలగం…రెండు వర్గాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.
ఫ్లెక్సీతో పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పడుతుందా?

దువ్వాడ ఇల్లు కాస్తా….రాత్రికి రాత్రే క్యాంప్‌ ఆఫీస్‌గా మారిపోయింది. క్యాంప్‌ ఆఫీస్‌ అని ఓ ఫ్లెక్సీ పెట్టేస్తే ఇంటి చుట్టు జరుగుతున్న పంచాయితీలు ఆగిపోతాయా? ఆస్తి వివాదం సద్దుమణుగుతుందా? అది ఇల్లు కాదు ఆఫీసు అని ధర్నా దుకాణం సర్దేసుకుని వాణి వెళ్లిపోతారా? క్యాంప్ ఆఫీస్‌ అయితే కుటుంబసభ్యులకు అనుమతి ఉండదా? క్యాంప్‌ ఆఫీసులో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు స్పేస్‌ ఉండదా? దీంతో వాణి నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి అనేదానిపై సస్పెన్స్‌ నెలకొంది. దువ్వాడ ఎపిసోడ్‌లో ఏ నిమిషంలో ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
దువ్వాడ ఇంట్లోకి చేరిన ఆ నలుగురు..!

ఇక ఇంట్లో తనకు రక్షణ కోసం నలుగురు బౌన్సర్లను దువ్వాడ పెట్టుకున్నారు. గతంలో గొడవ అయినపపుడు దువ్వాడ ఇంటి మీదకు 15మంది వచ్చారు. దువ్వాడ రక్షణ కోసం ఆయన ఇంటి బయట ఒక కానిస్టేబుల్‌ని నియమించారు. ఇక కారు షెడ్‌లో ధర్నా చేస్తున్న వాణి రక్షణ కోసం ఓ మహిళా కానిస్టేబుల్‌ని ఏర్పాటుచేశారు. ఇంటి చుట్టూ తిరుగుతున్న ఈ పంచాయితీలో ఇరు వర్గాలకు రక్షణ కల్పించడానికి అటు పోలీసులు, ఇటు ప్రైవేట్‌ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. రెండు వర్గాలు మోహరించి కూర్చోవడంతో ఇప్పట్లో ఈ ఇంటి పంచాయితీ తేలేలా కనిపించడం లేదు.