ఇక.. పురుషులకు డ్వాక్రా సంఘాలు

www.mannamweb.com


ఏర్పాటుకు అర్హుల ఎంపిక ప్రక్రియప్రారంభించిన మెప్మా అధికారులు

నరసరావుపేట సెంట్రల్, న్యూస్‌టుడే : ఇప్పటి వరకు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తోంది.

ఈ సంఘాల ద్వారా ఎందరో మహిళలు స్వయంఉపాధి పొందుతూ కుటుంబానికి చేదోడు, వాదోడుగా ఉండటంతో పాటు సమాజానికి అవసరమైన అనేక రకాల వస్తువులు తయారు చేసి నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం పురుషులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు, స్వయం ఉపాధి పొందేందుకు గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయనుంది. ఇందుకు ఇప్పటికే ఆయా రంగాల్లో పని చేస్తున్న వారిని గ్రూపులుగా చేసేందుకు ఆర్‌పీలు ఇంటింటికి వెళ్లి అర్హులను ఎంపిక చేస్తున్నారు.

అన్ని రంగాల వారు అర్హులే

గ్రూపుల్లో సభ్యులుగా చేరేందుకు అన్ని రంగాల వారు అర్హులేనని అధికారులు చెబుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, దివ్యాంగులు, జీగ్‌ వర్కర్స్‌ (జొమోటా, స్విగ్గి వంటి వాటిల్లో పని చేసేవారు), రవాణా కార్మికులు(రిక్షా, బల్లబండ్లు)లతో పాటు కేర్‌టేకర్, ఏసీ, వాషింగ్‌మిషన్, ఫ్రిజ్, ఎలక్ట్రిషియన్, ఫ్లంబర్, కార్పెంటర్లు, బ్యూటిషియన్స్‌ (సర్వీస్‌ ప్రొవైడర్స్‌)గా గుర్తించి వారిని సంఘాలుగా ఏర్పాటు చేస్తారు. వారు చేసే వృత్తిలో నైపుణ్యం పెంచేందుకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తారు. ఏసీ, వాషింగ్‌మిషన్, ఫ్రిజ్, ఎలక్ట్రిషియన్, ఫ్లంబర్, కార్పెంటర్లు, బ్యూటిషియన్స్‌ (సర్వీస్‌ ప్రొవైడర్స్‌) గుర్తించి వారికి శిక్షణ ఇప్పించి రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పిస్తారు. ఇందుకు ఆర్‌పీలు అర్హులను గుర్తించి సంఘాలు ఏర్పాటు చేసి వారికి రుణాలు మంజూరు చేస్తారని అధికారులు చెబుతున్నారు.

పురుషలకు స్వయం ఉపాధి లక్ష్యం

పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి వారు స్వయంఉపాధి పొందేందుకు సహకారాలు మెప్మా ఆధ్వర్యంలో అందిస్తాం. ఒక్కొక్క గ్రూపునకు 5 నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. వారికి తొలి విడతగా రూ.10 వేలు రుణం మంజూరు చేస్తాం. అది సకాలంలో తిరిగి చెల్లిస్తే వచ్చే సంవత్సరం అదనంగా మంజూరు చేస్తాం. అంతేకాక గ్రూపు సభ్యుల వృత్తికి తగినట్లుగా రుణాలు మంజూరు చేస్తాం. గ్రూపులుగా ఏర్పాటై స్వయంఉపాధి పొందాలనుకునేవారు జిల్లాలోని అన్ని మున్సిపల్‌ కార్యాలయాల్లో మెప్మా సిబ్బందిని కలిసి గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

విజయలక్ష్మి, ప్రాజెక్టు డైరెక్టర్‌