రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 (EAPCET) నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనుంది. దరఖాస్తులో తప్పుల సవరణకు ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ మధ్య అవకాశం కల్పించారు.
రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 14 వరకు, రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 18 వరకు, రూ. 5 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 19 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. ఈఏడాది కూడా ఈఏపీసెట్‌ను జేఎన్టీయూ నిర్వహించనుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, విజయవాడ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కాగా, కన్వీనర్ కోటా బీటెక్ సీట్లు మొత్తం రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నది.
నాన్ లోకల్ కోటా రద్దు..
ఇప్పటివరకు అమలులో ఉన్న 15 శాతం నాన్ లోకల్ కోటాను రద్దు కానుంది. కన్వీనర్ కోటా సీట్లన్నీ తెలంగాణకు చెందిన విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇంజినీరింగ్ సీట్లను 70 శాతం కన్వీనర్ కోటాలో, 30 శాతం మేనేజ్‌మెంట్ కోటాలో భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కన్వీనర్ కోటాలోని 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లకు తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడేవారు. అయితే ఉమ్మడి రాజధాని, రాష్ట్ర విభజన గడువు పదేండ్లు గతేడాదితో పూర్తయ్యాయి. దీంతో నాన్‌లోకల్ కోటా గడువు కూడా ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో కన్వీనర్ కోటాలోని పూర్తి సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే దక్కనున్నాయి.