ముఖ అందాన్ని పాడు చేసే సమస్యల్లో బ్లాక్‌హెడ్స్ ఒకటి. ముక్కుపై, గడ్డంపై మొండిగా ఉండే ఈ చిన్న నల్లటి చుక్కలు చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటిని తొలగించడానికి పార్లర్లకు వెళ్లడం, ఖరీదైన ఫేషియల్స్ చేయించుకోవడం అందరికీ సాధ్యం కాదు.
ఇలాంటి వారికి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో, చాలా సులభంగా బ్లాక్‌హెడ్స్‌ను పోగొట్టుకునే మార్గం ఒకటి ఉంది. మన ఇంట్లో ఉండే ఒక టవల్ చాలు.
బ్లాక్‌హెడ్స్ అంటే అదనపు నూనె, చనిపోయిన చర్మ కణాలు, దుమ్ము ఒకచోట చేరి రంధ్రాలను మూసివేస్తాయి. ఈ మూసుకుపోయిన రంధ్రాలు గాలి తగలగానే నల్లగా మారిపోతాయి. అందుకే వాటిని బ్లాక్‌హెడ్స్ అంటారు. ముఖంపై ఎక్కువ నూనె ఉత్పత్తి అయ్యే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.
టవల్ ఎలా పనిచేస్తుంది?
ఒక మృదువైన, శుభ్రమైన టవల్‌ను వేడి నీళ్లలో ముంచి ముఖంపై పెట్టుకోవాలి. వేడి ఆవిరి చర్మ రంధ్రాలను తెరుస్తుంది. లోపల పేరుకుపోయిన మురికి, నూనెను మెత్తబరుస్తుంది. తర్వాత, అదే టవల్‌తో సున్నితంగా రుద్దితే, బ్లాక్‌హెడ్స్ సులభంగా బయటకు వచ్చేస్తాయి. ఈ పద్ధతి చర్మానికి ఎటువంటి హాని చేయదు. రసాయనాలు, స్క్రబ్‌లు లేని ఈ చిట్కా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
ఎలా చేయాలి?
మొదట, ముఖం కడుక్కోవాలి. తర్వాత, వేడి నీళ్లలో టవల్‌ను ముంచి, నీళ్లు పిండి, ముఖంపై ఒక నిమిషం పాటు ఆవిరి పట్టినట్లుగా ఉంచుకోవాలి. ఇప్పుడు, టవల్‌తో బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట నెమ్మదిగా గుండ్రంగా రుద్దాలి. తర్వాత, చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకుంటే రంధ్రాలు మూసుకుంటాయి. చివరగా, చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ రాసుకోవడం ముఖ్యం.
ఈ చిట్కాను వారంలో రెండు, మూడు సార్లు ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు రోజూ రెండుసార్లు ముఖం కడుక్కోవడం, తరచూ చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండటం, దిండు కవచాలను మార్చడం లాంటివి చేస్తే బ్లాక్‌హెడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు.
































