భోజనం తర్వాత స్వీట్స్ తినే అలవాటు మనకు ఉంది. అయితే పంచదార అధికంగా ఉన్న స్వీట్స్ బదులు బెల్లం, నెయ్యి మిశ్రమం తినడం చాలా ఆరోగ్యకరం. ఈ సంప్రదాయ చిట్కా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పోషకాలు శరీరానికి బాగా పట్టుకుంటాయి. భారతీయ ఇళ్లలో భోజనం పూర్తి చేశాక ఏదైనా తీపి తినడం ఒక ఆచారం. అయితే, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న స్వీట్స్ తినడం వలన షుగర్ లెవెల్స్ వెంటనే పెరుగుతాయి. ఆయుర్వేదం ఈ తీపి కోరికకు అద్భుతమైన పరిష్కారం చెప్పింది. అదే బెల్లం, నెయ్యి మిశ్రమం. ఇది రుచికరంగా ఉండడమే కాదు, మెటబాలిజంకు, రోగనిరోధక శక్తికి చాలా మంచిది.
భోజనం తర్వాత బెల్లం, నెయ్యి ఎందుకు తినాలి?
శరీరం తన ప్రాథమిక విధులను నిర్వహించడానికి సరైన పోషకాలు అవసరం. నెయ్యి, బెల్లం మిశ్రమం శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. భోజనం తర్వాత ఈ మిశ్రమం తినడం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పోషకాల శోషణకు సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తోడ్పడుతుంది.
జీర్ణ ఎంజైముల మెరుగుదల: భోజనం తర్వాత ఒక చిన్న చెంచా ఈ మిశ్రమం తినడం జీర్ణ ఎంజైముల స్రావాన్ని పెంచుతుంది. జీర్ణక్రియ ప్రక్రియను మరింత సమర్థవంతంగా, హాయిగా మారుస్తుంది.
నెయ్యి ఎందుకు వాడాలి?
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది పేగులను సరళంగా మారుస్తుంది (Lubricates). మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. సులభంగా మల విసర్జన అయ్యేలా చేస్తుంది.
దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపు పొరను శాంతపరుస్తాయి. పోషకాల శోషణను కూడా మెరుగుపరుస్తాయి. నెయ్యి కేవలం జీర్ణక్రియకు సహాయకారి మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని కూడా పెంచే పోషక కొవ్వు.
బెల్లం ఎందుకు ముఖ్యం?
బెల్లం ఒక సహజ స్వీటెనర్. ఇందులో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు నిండి ఉంటాయి. ఇది జీర్ణ ఎంజైములను ప్రేరేపిస్తుంది. తేలికపాటి భేదిమందు (Laxative) లా పనిచేస్తుంది.
ఇది కాలేయాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సాధారణ సమస్యలను తగ్గిస్తుంది. బెల్లంలోని ఫైబర్, నెయ్యిలోని సరళత కలయిక క్రమంగా, ఆరోగ్యకరమైన మల విసర్జనను ప్రోత్సహిస్తుంది.
రెండూ కలిపితే ఏం జరుగుతుంది?
బెల్లం, నెయ్యి కలిపి భోజనం తర్వాత తింటే, ఇది శరీరంలోని దోషాలను (ముఖ్యంగా వాత దోషం) సమతుల్యం చేయడానికి సహజంగా సహాయపడుతుంది. ఈ మిశ్రమం జీర్ణ వ్యవస్థకు పోషణ ఇస్తుంది. శరీరం పోషకాలను లోతుగా గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. మంచి మల విసర్జన అయ్యేలా చూస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
రోజుకు ఎంత తీసుకోవాలి?
బెల్లం: రోజుకు 1 నుండి 2 టీ స్పూన్లు (సుమారు 5 నుండి 10 గ్రాములు) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖనిజాలను అందిస్తుంది.
నెయ్యి: రోజుకు 1 టీ స్పూన్ నుండి 1 టేబుల్ స్పూన్ (సుమారు 5 నుండి 15 గ్రాములు) వరకు తినడం సురక్షితం, ఆరోగ్యకరం. నెయ్యిలో సంతృప్త కొవ్వులు ఎక్కువ ఉంటాయి, కాబట్టి పరిమాణం చాలా ముఖ్యం.
సాధారణంగా, ఒక టీ స్పూన్ బెల్లంను ఒక టీ స్పూన్ నెయ్యితో కలిపి భోజనం తర్వాత తీసుకోవడం చాలా మంది పెద్దలకు సురక్షితమైన, ప్రయోజనకరమైన మోతాదు. అయితే, మధుమేహం లేదా కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.
గమనిక: ఈ కథనం కేవలం ఆయుర్వేదం, సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడింది. మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ చిట్కాను పాటించే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
































