భారతీయ రిటైల్ మార్కెట్‌లో డిమార్ట్ (DMart) ఒక సంచలనం. ఎక్కడ చూసినా, ఇంత తక్కువ ధరలా? అని ఆశ్చర్యపోయేలా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ రిటైల్ దిగ్గజం.
కానీ, ఈ అపారమైన సక్సెస్ వెనుక కేవలం తక్కువ ధరలు మాత్రమే కాదు… వినియోగదారుల మనస్తత్వాన్ని లోతుగా అర్థం చేసుకున్న ఒక మాస్టర్ బిజినెస్ స్ట్రాటజీ దాగి ఉంది.
DMart స్టోర్‌లోకి అడుగుపెట్టగానే మనం గమనించే మొదటి విషయం – ధరల వ్యత్యాసం. నిత్యావసరాల నుంచి బట్టలు, గృహోపకరణాలు, ప్లాస్టిక్ వస్తువుల వరకు ప్రతిదీ భారీ డిస్కౌంట్ ధరలకే లభిస్తాయి. ఎక్కడా లేని విధంగా తక్కువ ధరలు, అన్నీ ఒకేచోట లభించే సౌకర్యం’ – ఇదే DMart యొక్క అత్యంత శక్తివంతమైన అస్త్రం. వినియోగదారులకు ఇష్టమైన వస్తువులను అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడం ద్వారా, కస్టమర్లను స్టోర్ లోపలికి రప్పించడంలో ఇది నూటికి నూరు శాతం విజయం సాధిస్తోంది.
కానీ, అసలైన గేమ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. కస్టమర్ స్టోర్ లోపల ఎక్కువ సమయం గడపడం ద్వారా మరింత ఎక్కువ కొనుగోళ్లు చేస్తారు అనే సాధారణ సూత్రాన్ని DMart అత్యంత తెలివిగా అమలు చేసింది.
తల్లిదండ్రులు షాపింగ్ చేస్తుంటే, వారితో వచ్చిన పిల్లలకు సహజంగానే విసుగు వస్తుంది. ఆ విసుగుతో… ఇక చాలు, తొందరగా వెళ్లిపోదాం అంటూ పిల్లలు ఒత్తిడి పెడితే, తల్లిదండ్రులు తమ షాపింగ్‌ను అర్ధాంతరంగా ముగించాల్సి వస్తుంది. ఈ కీలకమైన పాయింట్‌ను DMart చాలా తెలివిగా పట్టుకుంది. అందుకే, తమ ప్రతి బ్రాంచ్ వెలుపల పిల్లలను ఆకర్షించే పాప్‌కార్న్ , ఐస్‌క్రీమ్ వంటి స్నాక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఐస్‌క్రీమ్‌లు కేవలం రూ. 20 నుంచి 30 మధ్య ఉంటుంది.అలాగే పాప్‌కార్న్ రూ. 10 నుంచి 30 మధ్య ఉంటుంది.స్టోర్ లోపల వేల రూపాయల కొనుగోళ్లు చేసిన తల్లిదండ్రులకు, బయట ఈ కొద్దిపాటి స్నాక్స్ కొనివ్వడం పెద్ద భారంగా అనిపించదు. పిల్లల కోరిక తీర్చడానికి, వారిని సంతృప్తి పరచడానికి తల్లిదండ్రులు వీటిని కొనివ్వడానికి వెనుకాడరు. ఈ చిన్నపాటి ఖర్చు, పెద్ద ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ పాప్‌కార్న్ , ఐస్‌క్రీమ్ సేల్ వెనుక ఉన్న అంతిమ లక్ష్యం… కేవలం కొద్దిపాటి ఆదాయం సంపాదించడం కాదు.పిల్లలు ఈ స్నాక్స్‌ను ఆస్వాదిస్తూ ఉంటే, వారికి విసుగు కలగదు. దానితో, తల్లిదండ్రులు తమ షాపింగ్‌ను మరింత గంటో, రెండు గంటలో నిదానంగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. కస్టమర్ స్టోర్‌లో ఎక్కువ సమయం గడపడం అంటే… వారు చూడని వస్తువులను చూడటం, అవసరం లేకపోయినా డిస్కౌంట్ ధరలకు ఆకర్షితులై మరింత ఎక్కువ వస్తువులను కొనుగోలు చేసే అవకాశం పెరగడం.
ఈ చిన్నపాటి ఆహ్లాదం కస్టమర్ల షాపింగ్ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. DMart అంటే తక్కువ ధరలే కాదు, ఫ్యామిలీతో కలిసి హాయిగా షాపింగ్ చేయొచ్చు అనే భావనను పెంచుతుంది.ఈ స్నాక్స్ విక్రయం పూర్తిగా DMart యొక్క అధికారం కిందనే జరుగుతుంది. అందువల్లే, వాటిని విక్రయించే వ్యక్తులు మారినా, నాణ్యత, రుచి మాత్రం అన్నిచోట్లా ఒకే విధంగా ఉండేలా జాగ్రత్త పడుతుంది.
తక్కువ ధరలకు నాణ్యమైన వస్తువులను అందిస్తూ, అదే సమయంలో చిన్నపాటి స్నాక్స్ అమ్మకాల ద్వారా కస్టమర్ల దృష్టిని ఆకర్షించి, వారి షాపింగ్ సమయాన్ని మరియు మొత్తం కొనుగోళ్లను పెంచే ఈ వ్యూహం నిజంగా ఒక మాస్టర్ బిజినెస్ స్ట్రాటజీ. అందుకే, DMart ఈ రోజు రిటైల్ రంగంలో ఒక తిరుగులేని దిగ్గజంగా నిలబడగలిగింది.
































