ఒకప్పుడు కేవలం కొందరి ఇళ్లలో మాత్రమే డైనింగ్ టేబుల్స్ కనిపించేవి. కానీ ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరూ డైనింగ్ టేబుల్స్‌ను ఉపయోగిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాల్లో కూడా ఈ కల్చర్ పెరుగుతోంది.
మారిన కాలంతో పాటు మనం కూడా మారాల్సిందే. అయితే డైనింగ్ టేబుల్‌పై కూర్చొని భోజనం చేయడం వల్ల కొన్ని లాభాలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. నేలపై కాళ్లు ముడుచుకొని కూర్చొని భోజనం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ నేలపై కూర్చొని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేస్తున్న సమయంలో వెనక్కి, ముందుకు వంగడం వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు శరీరంలో ఉత్పత్తవుతాయి. ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
* నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల బరువు తగ్గొచ్చు. నేలపై కూర్చొని భోజనం చేసే సమయంలో వెన్నుపూస నిటారుగా ఉంటుంది. దీంతో ఎంత తింటున్నామో స్పృహ ఉంటుంది. అయితే డైనింగ్ టేబుల్‌పై కూర్చొని భోజనం చేస్తే ఎంత తింటున్నారో తెలియకుండానే ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల ఊబకాయం సమస్య వస్తుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కింద కూర్చొని తినడం బెటర్.
* నేలమీద కూర్చొని తినడం వల్ల కండరాల్లో కదలిక పెరుగుతుంది. ఇది కడుపు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పొట్ట కండరాల్లో ఉండే నొప్పి తొలగిపోతుంది.
* నేలపై కూర్చొని తినడం వల్ల మెదడు కూడా రిలాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. వెన్నుపూస నిటారుగా ఉండడం వల్ల మెదుడుకు మెరుగైన రక్త ప్రసరణ అందుతుందని అంటున్నారు.
* అయితే కొందరికి నేలపై కూర్చొని తినడం వల్ల ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పితో బాధపడేవారు నేలపై కూర్చొని తినడం వల్ల ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.