రేపు విద్యాసంస్థలు, దుకాణాలు బందు.. కారణమిదే

www.mannamweb.com


ఇప్పటికే విద్యార్థులకు వరుసగా సెలవులు వచ్చాయి. ఆగస్టు 15-19 వరకు హాలీడేస్ రాగా.. నేడు భారీ వర్షాల కారణంగా.. హైదరాబాద్ నగరంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇక రేపు అనగా ఆగస్టు 21, బుధవారం నాడు విద్యాసంస్థలు మూతపడనున్నట్లు సమాచారం. కేవలం స్కూళ్లు, కాలేజీలు మాత్రమే కాక దుకాణాలు కూడా మూతపడనున్నాయి అని తెలుస్తోంది. మరి ఎందుకు ఇలాంటి నిర్ణయం.. అసలేం జరిగింది.. అంటే..

రేపు అనగా ఆగస్ట్ 21, బుధవారం నాడు భారత్ బందుకు పిలుపునిచ్చాయి పలు సంఘాలు. కారణం.. తాజాగా సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు వ్యతిరేకంగా పలు సంఘాలు బుధవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. రిజర్వేషన్ బచావో సంఘర్షణ సమితి ఇచ్చిన పిలుపునకు రాజస్తాన్, యూపీలోని పలు సంఘాలు మద్దతు తెలిపాయి.

భారత్ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. బందుకు మద్దతిచ్చిన రాష్ట్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించి.. భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్‌కు పిలుపునిచ్చిన సంఘాలతో పాటు మార్కెట్ అసోసియేషన్‌లతో సమావేశాలు నిర్వహించి శాంతిభద్రల విషయంలో సహకారాన్ని తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఆగస్టు 1న సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఎస్సీ, ఎస్టీలను ఉపవర్గాలుగా విభజించడానికి రాష్ట్రాలకు అధికారం లభించినట్లయ్యింది. అయితే, ఈ నిర్ణయాన్ని కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సవాలు చేయడం, దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం భారత్ బంద్ ప్రధాన ఉద్దేశమని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ బంద్‌కు పలు రాజకీయ, సామాజిక సంస్థల మద్దతు తెలిపే అవకాశం ఉంది.

ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని సంఘాలు భారత్ బందుకు మద్దతిచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలు, రవాణా, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు బంద్‌కు సహకరించాలని వారు కోరారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి రేపటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. ఒకవేళ ప్రభుత్వం భారత్ బందుకు మద్దతిస్తే.. రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు వచ్చే అవకాశం ఉంది.