Election Ink: టాటూలా శాశ్వతంగా పడిపోయిన సిరా గుర్తు.. 9 ఏళ్లయినా ఆ మహిళకు చెదరిపోని ఇంక్ మార్క్!

మన దేశంలో ఎన్నికల వేళ ఓటేసిన వారి వేలిపై సిరా గుర్తు వేయడం అనాదిగా సంప్రదాయంగా వస్తోంది. దీంతో ఎన్నికలు ఏవైనా ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ప్రతి ఒక్కరి ఎడమ చేతి చూపుడు వేలికి ఈ ఇంకు చుక్కను అధికారులు పెడతారు. పోలింగ్‌ రోజు ఓటరు ఓటేసినట్లు గుర్తు ఇదే. అలాగే ఒకసారి ఓటు వేసిన ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు ఈ గుర్తు ఓ సంకేతం. వేలి గోరుతోపాటు చర్మానికి కూడా కాస్త అంటుకుంటుంది. అయితే ఈ సిరా చుక్క అంత త్వరగా చెరగదు. సిరాగుర్తు వేసిన 15 నుంచి 30 సెకండ్లలో ఆరిపోతుంది. సాధారణంగా పది రోజులు లేదంటే నెల రోజులకు ఈ గుర్తు పూర్తిగా చెరిగిపోతుంది. అయితే ఓ మహిళకు మాత్రం ఈ గుర్తు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయింది. దీంతో ఆమె గత మూడు సార్లు జరిగిన ఎలక్షన్లకు తన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయింది.


కేరళకు చెందిన ఉష అనే మహిళ వయసు 62 ఏళ్లు. ఆమె 2016లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కులపుల్లి ఏయూపీ పాఠశాలలో ఓటేసింది. అప్పుడు ఎన్నికల అధికారి ఆమె వేలిపై వేసిన సిరా గుర్తు ఎన్ని రోజులైనా అలాగే చెరిగిపోకుండా ఉండిపోయింది. ఎన్ని రకాల సబ్బులు, ద్రావణాలు ఉపయోగించినా లాభం లేకపోయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తే.. ఆమె వేలిపై గుర్తు చూసి ఓటేసేందుకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో చివరికి ఓటేసేందుకు అనుమతి లభించింది.

తన వేలిపై ఉన్న సిరా గుర్తు కారణంగా పోలింగ్‌ కేంద్రాల్లో తలెత్తుతున్న వివాదాల దృష్య్టా.. ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఉష ఓటేసేందుకే వెళ్లలేదు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన డీసీసీ ప్రధాన కార్యదర్శి టీవై షిహాబుద్దీన్‌కు ఉష తన గోడు వెళ్లడించింది. దాదాపు తొమ్మిదేళ్లయినా తన ఎడమచేతి చూపుడు వేలికి వేసిన సిరా గుర్తు చెరిగిపోలేదని వాపోయింది. అతను ఎన్నికల అధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లగా.. వారు సమస్యను పరిష్కరించి ఆమె ఓటేసేందుకు అనుమతిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సిరా ఇంత సుదీర్ఘ కాలం పాటు మాసిపోకుండా ఉండిపోవండం ఇంత వరకూ ఎక్కడా జరగలేదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఒక వేళ్ల మహిళ గోళ్ల కింద నల్లమచ్చలు లాంటివి ఏవైనా ఏర్పడి ఉండవచ్చని చర్మవ్యాధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉష వేలిపై శాశ్వతంగా పడిపోయిన సిరా గుర్తు మరోమారు హాట్‌టాపిక్‌గా మారింది.