బ్యాంక్ లోన్ తీసుకున్న వారికి గుడ్‌ న్యూస్.. భారీగా తగ్గనున్న ఈఎంఐలు.

మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఆర్బీఐ (RBI) రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఆరుగురు సభ్యుల బృందం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


బ్యాంక్ లోన్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది. 2025 ఏప్రిల్ 7 నుంచి 9వ తేదీ వరకు జరిగే తదుపరి మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఆర్బీఐ (RBI) రెపో రేటును తగ్గించే అవకాశం ఉంది. ఆరుగురు సభ్యుల బృందం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

రెపో రేటు అంటే ఏంటి..? రెపో రేటు అంటే రిజర్వ్‌ బ్యాంక్‌, బ్యాంకులకు ఇచ్చే రుణాలపై విధించే వడ్డీ రేటు. ఆర్‌బీఐ ఈ రెపో రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు సాధారణంగా తమ కస్టమర్లకు ఇచ్చే లోన్‌లపై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. దీంతో కస్టమర్ల లోన్ ఈఎంఐల భారం తగ్గుతుంది.

ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటే, త్వరలో రెపోరేటు 6.25% నుంచి 6%కి తగ్గనుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ స్టాన్స్‌ను (Monetary Policy Stances) ‘న్యూట్రల్‌ (Neutral)’ నుంచి ‘అకామడేటివ్‌ (Accommodative)’కి మార్చవచ్చు. భవిష్యత్తులో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు బ్యాంకులు మరింత తక్కువ వడ్డీలకు లోన్‌లు అందించే అవకాశం ఉంటుంది.

రెపో రేటు ఎందుకు తగ్గుతోంది..? మానిటరీ పాలసీ కమిటీ (MPC) మీటింగ్‌ కీలక సమయంలో జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొత్త టారిఫ్స్ ప్రకటించారు. ఇది ధరలను (ద్రవ్యోల్బణం) పెంచవచ్చు, వాణిజ్య ఉద్రిక్తతలను రేకెత్తించవచ్చు. ఈ పరిణామాలన్నీ ప్రపంచ వృద్ధికి అవరోధాలుగా మారుతాయి. ఈ సమయంలో భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించి RBI ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే RBI ఇప్పుడే ద్రవ్యోల్బణ అంచనాలు మార్చే అవకాశం లేదు. ‘భారతదేశ ద్రవ్యోల్బణం (Inflation) అంచనాల కంటే తక్కువగా ఉంది. 2025 జనవరి-ఫిబ్రవరిలో సగటున 3.9%గా ఉంది. జనవరి-మార్చిలో RBI అంచనా వేసిన 4.8% కంటే ఇది తక్కువ. వృద్ధి రేటు కూడా మందగించింది. రూపాయి మునుపటిలా ఒత్తిడిలో లేదు. దీనివల్ల RBI రేట్లను తగ్గించడం సులభం అవుతుంది.’ అని డీబీఎస్‌ బ్యాంక్ ఉన్నతాధికారి రాధిక రావు చెప్పారు.

మరోసారి రేట్ల కోత..? ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25% చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలలో ఇది మొదటి రేట్ కట్ కావడం గమనార్హం. ద్రవ్యోల్బణం తగ్గడం, వృద్ధి రేటు నెమ్మదిస్తుందనే ఆందోళనల కారణంగా ఆర్బీఐ రెపో రేటు కోత విధించింది. ఏప్రిల్ 9న ఆర్బీఐ రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కి చెందిన గౌర సేన్ గుప్తా వంటి నిపుణులు ఆశిస్తున్నారు. ఇదే జరిగితే రెపో రేటు 6%కి తగ్గుతుంది.

విధాన వైఖరి మారుతుందా..? ఆర్‌బీఐ మానిటరీ పాలసీ స్టాన్స్ (Monetary Policy Stances) అంటే రేట్లను ఎలా నిర్వహించాలో సూచించే ప్రణాళిక. ఈసారి ఇది కూడా మారవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధి మదన్ సబ్నవిస్ దీని గురించి మాట్లాడారు. ఆర్‌బీఐ వైఖరి అకామడేటివ్‌ స్టేటస్‌కు మారుతుందన్నారు. భవిష్యత్తులో ఇంకా రెపో రేటు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. అయితే ప్రపంచ అనిశ్చితి, వ్యవస్థలోకి ఇప్పటికే చేరిన అదనపు నగదు కారణంగా, ఆర్‌బీఐ స్టాన్స్ న్యూట్రల్‌గానే ఉంటుందని మరికొందరు నిపుణులు నమ్ముతున్నారు.

యూఎస్‌ టారిఫ్స్ పెంపుతో అక్కడ ధరలు పెరగవచ్చు. ఈ ప్రభావంతో యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) సొంత రేట్ల తగ్గింపును పరిమితం చేయవచ్చు. అది ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. దీంతో ఆర్‌బీఐ జాగ్రత్తగా ఉంటుంది.

ద్రవ్యోల్బణం (Inflation), వృద్ధి అంచనాలు..: RBI తన అంచనాలను మార్చకపోవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి (GDP) 6.7%గా ఉంటుందని, ద్రవ్యోల్బణం 4.2% వద్ద ఉంటుందని అంచనా వేసింది. అయితే బ్రోకరేజ్ సంస్థ నోమురా 2026కి 6% వద్ద స్వల్పంగా తక్కువ వృద్ధిని అంచనా వేసింది, ఇది 2025లో 6.2% నుంచి తగ్గింది. దీనికి కొంతవరకు యూఎస్‌ టారిఫ్స్ కారణం.

తగ్గునున్న లోన్‌ వడ్డీల భారం..! రెపో రేటును 6%కి తగ్గించడం వల్ల లోన్‌లు తక్కువ వడ్డీలకు లభిస్తాయి. రెపో రేటుతో ముడిపడి ఉన్న హోమ్‌ లేదా పర్సనల్‌ లోన్‌ల ఈఎంఐ(EMI)లు కొంచెం తగ్గవచ్చు. ఫిబ్రవరిలో జరిగిన తగ్గింపుతో కూడా బ్యాంకులు రుణ రేట్లను తగ్గించాయి.