ఇజ్రాయెల్(Israel)పై హమాస్ అక్టోబర్ 7 దాడి తర్వాత పాలస్తీనా పనివాళ్లను రాకుండా పూర్తిగా నిలిపేశారు. దీంతో వేల సంఖ్యలో వర్కర్ల కొరత ఏర్పడింది.
ఇప్పుడు వారి స్థానాలను భర్తీ చేయడానికి ఇతర ఆప్షన్లను ఇజ్రాయెల్ ఎంచుకొంది. ఇప్పుడు అక్కడ స్థానిక వర్కర్స్‌తోపాటు.. భారతీయులు, చైనీయులు అధికంగా కనిపిస్తున్నారు.
ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి ఇతర దేశాలకు చెందిన వర్కర్స్ భయపడటం లేదు. తాజాగా భారత్‌కు చెందిన రాజు నిషాద్ అనే 35 ఏళ్ల ఉద్యోగి మాట్లాడుతూ ఇక్కడ భయపడేందుకు ఏమీ లేదు. ఏమైనా గగనతల దాడులు జరుగుతుంటే తాము సురక్షిత ప్రదేశాలకు వెళతామని.. అవి ముగిసిన తర్వాత తిరిగి పనులు మొదలుపెడతామని వెల్లడించాడు. స్వదేశంలో కంటే అక్కడ మూడు రెట్లు అధిక ఆదాయం లభిస్తుందని వెల్లడించాడు. భవిష్యత్తు కోసం తాను డబ్బులు దాచుకొంటున్నట్లు తెలిపాడు.
నిర్మాణరంగంలో కొత్త అవకాశాలు..
ఏడాదికాలంలో భారత్ నుంచి 16,000 మంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు. మరింతమందిని తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భారతీయులు దాదాపు కొన్ని దశాబ్ధాలుగా ఇజ్రాయెల్‌కు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే వేల మంది కేర్‌గివర్స్ వృద్ధ ఇజ్రాయెలీలను చూసుకొంటున్నారు. వజ్రాల వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు కూడా ఉన్నారు. కానీ, గాజా వార్ తర్వాత మాత్రం నిర్మాణరంగ కార్మికులను కూడా ఇజ్రాయెల్ పిలిపించుకొంటోంది.
దిల్లీకి చెందిన డైనమిక్ స్టాఫింగ్ సర్వీసెస్ సంస్థ అధిపతి అక్టోబర్ సమీర్ ఖోస్లా తర్వాత నెల రోజులకు ఇజ్రాయెల్ వెళ్లారు. అక్కడి మార్కెట్ గురించి తనకు అంతగా తెలియదని తెలిపారు. భారత్‌తో ఉన్న సంబంధాల రీత్యా.. మనవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్నారు. దాదాపు 10 వేల మందిని అక్కడికి పంపించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
మరోవైపు యుద్ధానికి ముందు పాలస్తీనా వర్కర్స్ స్థాయిలో ఇంకా భారతీయులు రాలేదని అక్కడి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హమాస్ దాడికి ముందు నిత్యం 80,000 మంది పాలస్తీనా వాసులు నిర్మాణరంగంలో పనిచేసేవారు. వీరితోపాటు మరో 26 వేల మంది విదేశీ పనివారు కూడా ఉండేవారు. ప్రస్తుతం కేవలం 30,000 మంది విదేశీయులు మాత్రమే అక్కడ పనిచేస్తున్నారు.