104 ఉద్యోగులపై ఎస్మా – ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం, ఎస్మా అంటే ఏమిటి?

www.mannamweb.com


104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం. వైద్య శాఖలోని 104 విభాగం లో పనిచేస్తున్న ఉద్యోగులు మరో ఆరు నెలలపాటు ఎలాంటి బంద్ లూ, నిరసనలు చేపట్టరాదంటూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ బాబు ఆదేశాలు జారీ చేశారు.

తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

అసలు వివాదం ఏమిటి??

గత 16 సంవత్సరాలుగా చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్న తమకు జీతాలు పెంచడం తో సహా ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలంటూ 104 ఉద్యోగులు కలెక్టరేట్ల ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. తమకు జీతాలు థర్డ్ పార్టీ ద్వారా ఇస్తారనీ గత మూడు నెలలుగా అసలు జీతాలే ఇవ్వడం లేదనేది వారి వాదన. ప్రజల ప్రాణాలను కాపాడుతూ 104 అంబులెన్సులు నడుపుతూ ఎంతో సేవ చేస్తున్నామని గత ప్రభుత్వం హయాం లో ఆర్థికంగా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నామంటూ 104 ఉద్యోగులు దీక్షలు చేస్తున్నారు. థర్డ్ పార్టీ విధానాన్ని విధానాన్ని రద్దు చేయడంతో పాటు తమను పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది వారి డిమాండ్.

అలాగే ప్రభుత్వమే 104లను నిర్వహించాలని వారు అంటున్నారు.ఆ డిమాండ్స్ లో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలకు వాళ్ళు పిలుపు ఇచ్చారు. దీనివల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందంటూ ఏపీ ప్రభుత్వం తక్షణమే విధుల్లో చేరాలని ఎస్మా ను ప్రయోగించింది. ఇప్పుడు 104 ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారు అనేదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. సరిగ్గా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలలు పూర్తవుతున్న రోజునే ఇలా 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించాల్సి రావడం చర్చనీయాంశమైంది.

ఎస్మా అంటే ఏమిటి?

ఉద్యోగులను కలవరపెట్టే అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ‘ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటినెన్స్ యాక్ట్ ‘ నే ESMA గా పిలుస్తారు. 1981 లో ఈ చట్టాన్ని తొలిసారి రూపొందించారు. ప్రజల అత్యవసర సేవలకు, జీవన విధానానికి ఆటంకం కలిగించేలా ఏదైనా విభాగ ఉద్యోగులు ధర్నాలు,ఆందోళనలకు దిగితే వారికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య అవసరాలకు అత్యంత ముఖ్యమైన 104 సేవలు ఆటంకం కలిగించేలా ఆందోళనకు దిగుతున్నారంటూ ప్రస్తుతం ఆ విభాగ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం ESMA ను ప్రయోగించింది.