శుక్రవారం నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు.. ఏమేం ఉంటాయంటే

www.mannamweb.com


భారీ వర్షాలు, వరద సృష్టించిన బీభత్సంతో విజయవాడ ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాలు తగ్గినా.. వరద ముంపు కొనసాగుతుండడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇప్పటికీ.. పలు కాలనీల్లో మోకాళ్ల లోతులో వరద నీరు ఉండడంతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా ప్రాంతాల వరద బాధితులకు పడవలు, వాహనాల ద్వారానే ఆహారం, వాటర్‌ ప్యాకెట్లు అందిస్తున్నారు అధికారులు, వివిధ స్వచ్చంధ సంస్థల నిర్వాహకులు. అటు.. సీఎం చంద్రబాబు సైతం.. నాలుగైదు రోజులుగా విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లోనే మకాం వేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే.. విజయవాడ వరద బాధితులకు ఆదుకునేందుకు మరో మహాత్తర కార్యక్రమం చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. ఆరు రకాల నిత్యవసర సరుకుల కిట్‌ను శుక్రవారం నుంచి అందించబోతోంది. 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, లీటరు వంటనూనె, 2 కిలోల ఉల్లిపాయలు, రెండు కేజీల ఆలుగడ్డలతో కూడిన 6 రకాల రేషన్‌ సరుకులు ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. రెండు రోజుల్లో సుమారు 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్‌కార్డు లేనివారికి కూడా ఆధార్‌, వేలిముద్రతో సరుకులు సప్లయ్‌ చేస్తామని ప్రకటించారు. ఈ-పోస్‌ మిషన్‌ ద్వారా సరకుల పంపిణీ జరుగుతుందన్నారు.

నిత్యవసరాలు ఇవ్వడమే కాదు.. వండుకునేందుకు అవసరమైన గ్యాస్‌ వసతులు కూడా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. దానికి సంబంధించి గ్యాస్‌ కంపెనీలు కూడా సర్వీస్‌ చేసేందుకు ముందుకు వచ్చాయని.. ముంపు ప్రాంతాల్లో 12 గ్యాస్‌ సర్వీస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తారని తెలిపారు. మొత్తంగా.. విజయవాడ వరద నేపథ్యంలో ఆరు రకాల సరుకులతో ఇంటింటి రేషన్‌ కిట్‌ పంపిణీకి భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.