నిత్య యవ్వనం సాధ్యమే..! వృద్ధాప్యాన్ని జయించే వ్యాక్సిన్ వచ్చేసింది

వృద్ధాప్యం అంటేనే చాలా మంది భయపడుతుంటారు. సాధ్యం కాదని తెలిసినా ఎప్పుడూ యవ్వనంగా ఉంటే బాగుండునని కలలు గంటుంటారు. ఎందుకంటే వృద్ధ్యాప్యంలో అందం క్షీణిస్తుంది.


ఉత్సాహం తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలు దాడిచేస్తుంటాయి. కాగా శాస్త్రవేత్తలు కూడా అనేక సంవత్సరాలుగా వృద్ధాప్యాన్ని జయించే వ్యాక్సిన్లను కనుగొనే పనిలో భాగంగా రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంతకాలమైతే సాధ్యం కాలేదు. కానీ ఇటీవల అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోగల మయామి నగరంలోని (Miami) ఇమ్మోర్టా బయో (Immorta Bio) అనే బయోటెక్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఒకడుగ ముందుకు వేశారు. వృద్ధాప్యాన్ని అడ్డుకోగల వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీనిని ‘సెనోవాక్స్ (SenoVax)’ అని పిలుస్తున్నారు. జంతువులపై ప్రయోగాల్లో పాజిటివ్ ఫలితాలు రావడంతో మానవులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించేందుకు ఇమ్మోర్టా బయోకు చెందిన శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ పేటెంట్ హక్కుకోసం దరఖాస్తు కూడా చేశారు.

తాము వృద్ధాప్యాన్ని జయించే అద్భుతాన్ని కనుగొన్నామని ఇమ్మోర్టా బయోటెక్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. అయితే తాము అభివృద్ధి చేసిన సెనోవాక్స్ (SenoVax) అనే వ్యాక్సిన్ శరీరంలో వృద్ధాప్య లక్షణాలను అడ్డుకోవడంతోపాటు మానవ జీవితకాలాన్ని రెట్టింపు చేయగలదని వారు చెబుతున్నారు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించాక రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడం మొదలు పెడుతుంది. వృద్ధాప్యానికి కారణం అయ్యే సెనెసెంట్ సెల్స్ (వృద్ధాప్య కణాలు)ను వెంటనే గుర్తించి, నాశనం చేయడానికి సహాయపడుతుంది. దీంతో శరీరంలో వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా ఉంటాయి. వృద్ధాప్యాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

సెనోవాక్స్ (SenoVax) ఇప్పటికే ప్రీక్లినికల్ పరీక్షల్లో క్యాన్సర్ ట్యూమర్ల పెరుగుదలను అడ్డుకుని, వాటికి మద్దతు ఇచ్చే పరిస్థితిని బలహీనపరిచింది. జంతు ప్రయోగాల్లో, జీవితకాలం 100% కంటే ఎక్కువగా పెంచింది. అందుకే త్వరలో మానవులపై క్లినికల్ ట్రయల్స్ (పరీక్షలు) ప్రారంభించాలని శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. ఇక ట్రయల్స్ విషయానికి వస్తే.. శాస్త్రవేత్తలు సెనోవాక్స్‌ను స్టెమ్‌సెల్ రివైవ్(StemCellRevivify) థెరపీతో కలిపి ఉపయోగించాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది వృద్ధాప్యానికి ప్రధాన కారణాలైన కణాల్లో గాయాలను మాన్పించి పునరుద్ధరణ సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి యంగ్ స్టెమ్ సెల్స్ ఉపయోగించి శరీరాన్ని పునరుజ్జీవనం చేయడం ద్వారా మరింత ఆశాజనకమైన ఫలితాలు ఆశించవచ్చు. మొత్తానికి వృద్ధాప్యాన్ని జయించగల చికిత్స త్వరలో రాబోతోంది. మానవులపై ప్రయోగాల్లో సక్సెస్ అయితే గనుక ప్రపంచ వైద్య చరిత్రలో మరో అద్భుతం సాధించినట్టేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.