ప్రైవేటు ఆస్పత్రుల్లో నిలువు దోపిడీ
వైద్య పరీక్షలకే వేలు..
అడ్మిట్ అయితే లక్షలే..
వీలైనంత దండుకోవడం.. ఆపై చేతులు ఎత్తేయడం..
పర్యవేక్షణ మరచిన
వైద్యఆరోగ్య శాఖ
- గుండె బరువుగా ఉందని కదిరి ప్రాంతానికి చెందిన ఒక మహిళను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. టూడీ ఎకో, సీటీ స్కానింగ్, రక్తపరీక్షలని రూ.50వేలుపైగా ఖర్చు పెట్టించారు. యాంజియోగ్రామ్, స్టంట్ పేర్లతో రూ.లక్ష దండుకున్నారు. అయినా బాధిత మహిళకు బాధ తప్పలేదు. ఇదేంటని అడగడంతో టీబీ వ్యాధి అంటూ సర్వజన ఆస్పత్రికి రెఫర్ చేసి, చేతులు దులుపుకున్నారు.
- ఉరవకొండ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి ఆయాసం ఉందంటూ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. ఊపిరితిత్తులు, ఈఎనటీ పరీక్షలు చేయించడానికి రూ.40వేలు వసూలు చేశారు. పరీక్షల్లో
- సమస్య లేదని తేలింది. గ్యాస్ర్టిక్‌తో ఆయాసం వస్తుందని ఎండోస్కోపీ తదితర పరీక్షలు చేయించి రూ.30వేల వరకు దండుకున్నారు. చివరికి మందులు రాసిచ్చి ఇంటికి పంపారు.
- అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఒక యువకుడు ఉన్నఫలంగా కళ్లు తిరిగి పడిపోయాడు. నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎమ్మారై, రక్తపరీక్షలు చేశారు. నరాలు బాగున్నాయనీ, మెదడులో రక్తం గూడుకట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన చేయాలంటే రూ.2 లక్షలకుపైగా అవుతుందని అడ్మిట్ కావాలని చెప్పడంతో ఆ యువకుడు, కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. అప్పటికే రూ.75వేలు వారి నుంచి వసూలు చేశారు.
నిత్యం ప్రైవేటు ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో ఇలాంటివి జరుగుతున్నాయి. ఆస్పత్రికి వచ్చేవారి భౌతిక ఛాయలు, సిఫార్సులు, ఎంత పెట్టుగోలరన్న అంచనాకు వచ్చిన తరువాతే ట్రీట్‌మెంట్ మొదలు పెడుతున్నారు. బాధితుల నుంచి సాధ్యమైనంత వసూలు చేయడమే లక్ష్యం. అదృష్టం బాగుండి బయటపడితే రూ.వేలల్లో సరిపోతుంది. ఏదైనా జరిగితే రూ.లక్షల్లో చెల్లించాల్సి వస్తోందని బాధిత రోగులు వాపోతున్నారు.
అనంతపురం వైద్యం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): జీవన శైలిలో వస్తున్న మార్పుల నేపథ్యంలో పలురకాల జబ్బులు.. ప్రజలను వెంటాడుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేటు ఆస్పత్రుల పేరుతో వ్యాపారం మొదలైంది. పట్టణాలు, పల్లెలు అన్న తేడాలేకుండా పుట్టగొడుగొల్లా ప్రైవేటు ఆస్పత్రులు వెలుస్తున్నాయి. వీధికో ల్యాబ్, ఊరికో ఆస్పత్రి పుట్టుకొస్తున్నాయి. నియోజకవర్గ, జిల్లాకేంద్రంలో పదుల సంఖ్యలో డయాగ్నెస్టిక్ కేంద్రాలు, ల్యాబ్‌లు, ఆస్పత్రులు నెలకొల్పుతున్నారు. సూపర్ స్పెషాలిటీ పేరుతో అన్నిరకాల వ్యాధులకు వైద్యం చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. ఓపీకి వచ్చిన వారిని అడ్మిషన చేసుకుని వారి నుంచి వీలైనంతగా దండుకుంటున్నాయి. పరిస్థితి విషమిస్తే చేతులెత్తుస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
పర్యవేక్షణ గాలికి…
జిల్లాలో 230కిపైగా ప్రైవేటు ఆస్పత్రులు, వందకుపైగా ల్యాబ్‌లు, 150కిపైగా స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి గుర్తింపు పొందినవి మాత్రమే. అనధికారికంగా ఎన్నో ఉన్నాయని అధికార వర్గాలే సెలవిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నిద్రమత్తులో ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహిస్తున్నారు. దొరికినంత దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత రోగులు, వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
బాధ్యత ఎవరిది?
ఐదు నెలల గర్భిణి రాధిక ఆస్పత్రికి వెళ్తే.. ప్రాణాలు తీశారు. కూలికెళ్తేగానీ పూట గడవని ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇది ఒక రాధికనే కాదు.. జిల్లాలో తరచూ జరుగుతున్న ఘటనలు. ప్రాణాలను నిలబెట్టుకోవాలని ఆస్పత్రికి తీసుకొస్తే… మృతదేహాలను ఇళ్లకు తీసుకెళ్లాల్సి వస్తోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని బాధిత కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులా, వైద్య ఆరోగ్యశాఖా అని నిలదీస్తున్నాయి.
కఠిన చర్యలు తీసుకుంటాం
ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ చిన్న ఘటన జరిగినా ఆయా కేంద్రాలను సీజ్ చేస్తున్నాం.
































