లక్షల డిస్కౌంట్లు ఇచ్చినా కొనేనాథుడే లేడు

రోనా మహమ్మారి తర్వాత భారతీయుల ప్రయాణ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు 7-సీటర్, మల్టీ పర్పస్ వాహనాలకు (MPV) డిమాండ్ అమాంతం పెరిగింది.


ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన దేశీ దిగ్గజం మారుతి సుజుకి.. తన భాగస్వామ్య సంస్థ టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్‎ను అరువు తెచ్చుకుంది. దాని రూపురేఖలను స్వల్పంగా మార్చి ఇన్విక్టో(Invicto) అనే పేరుతో గతేడాది గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

టయోటా ఇన్నోవాకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ తమకూ కలిసొస్తుందని మారుతి ఆశపడింది కానీ, క్షేత్రస్థాయిలో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ ఏడాది నవంబర్‌లో కేవలం 410 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మారుతి పోర్ట్‌ఫోలియోలోని 18 మోడళ్లలో అత్యంత తక్కువ సేల్స్ ఉన్న రెండో కారుగా ఇన్విక్టో నిలవడం ఆ కంపెనీని కలవరపెడుతోంది.

సాధారణంగా మారుతి కారు అంటేనే మధ్యతరగతి ప్రజలకు ఒక నమ్మకం. తక్కువ ధర, ఎక్కువ మైలేజీ అనే సూత్రంతో మారుతి కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. కానీ ఇన్విక్టో విషయంలో ఆ మ్యాజిక్ పని చేయడం లేదు. భారీగా పేరుకుపోయిన స్టాక్‌ను వదిలించుకోవడానికి కంపెనీ ఈ కారుపై ఏకంగా రూ.1.40 లక్షల నుంచి రూ.2.18 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

ఇంత భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ కస్టమర్లు ఇన్విక్టో వైపు మొగ్గు చూపడం లేదు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 24.97 లక్షల నుంచి రూ. 28.60 లక్షల వరకు ఉంది. ఇదే ధరకు అసలైన టయోటా బ్రాండ్‎తో ఇన్నోవా దొరుకుతుంటే, కేవలం లోగో మార్చిన మారుతి కారుపై పాతిక లక్షలకు పైగా ఖర్చు చేయడానికి జనం సిద్ధంగా లేరు.

పైగా హైక్రాస్‌లో ఉన్న అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS), మెమరీ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లను ఇన్విక్టోలో మారుతి తొలగించడం మరో పెద్ద మైనస్ పాయింట్‌గా మారింది.

అమ్మకాలు ఆశాజనకంగాలేనప్పటికీ, కారు క్వాలిటీ విషయంలో మాత్రం ఇన్విక్టో అదరగొడుతోంది. గ్లోబల్ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించిన మారుతి అత్యంత సురక్షితమైన మూడవ కారు ఇది. ఇందులో ఉన్న 2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీ అద్భుతమనే చెప్పాలి. ఇది 184 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తూనే, భారీ కారు అయినప్పటికీ లీటరుకు 22.16 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

లోపల పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం లెదర్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి లగ్జరీ ఫీచర్లు అన్నీ ఉన్నాయి. అయితే, దశాబ్దాలుగా మారుతిని కేవలం బడ్జెట్ కార్ల బ్రాండ్‌గా చూస్తున్న భారతీయ వినియోగదారులు, అంత భారీ ధర పెట్టి మారుతి లోగో ఉన్న కారును కొనడానికి మానసికంగా సిద్ధపడలేకపోతున్నారు. ఫలితంగా ఈ సేఫ్టీ కింగ్ షోరూమ్‌లకే పరిమితమవుతోంది.

సుజుకి, టయోటా మధ్య ఉన్న ఒప్పందంలో ఇప్పటివరకు టయోటానే ఎక్కువ లాభపడింది. మారుతికి చెందిన బాలెనో (గ్లాంజా), విటారా బ్రెజ్జా (హైరైడర్) మోడళ్లను టయోటా తన లోగోతో అమ్మి లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించింది. కానీ మారుతి మాత్రం టయోటా నుంచి తెచ్చుకున్న ఇన్నోవాను హిట్ చేయలేకపోతోంది.

దీనికి ప్రధాన కారణం ఇన్విక్టో కేవలం ఖరీదైన హైబ్రిడ్ వేరియంట్లలో మాత్రమే లభించడం. ఇన్నోవాలో ఉన్నట్లుగా తక్కువ ధరకు వచ్చే నాన్-హైబ్రిడ్ (పెట్రోల్) ఆప్షన్ ఇన్విక్టోలో లేదు. దీంతో కారు బేస్ ప్రైస్ పెరిగిపోయింది. ఫలితంగా మారుతి షోరూమ్‌కు వచ్చే కస్టమర్లు ఇన్ని లక్షలు పెట్టే బదులు గ్రాండ్ విటారా లేదా ఎర్టిగా వంటి కార్లను ఎంచుకుంటున్నారు తప్ప, ఇన్విక్టో వైపు కన్నెత్తి చూడటం లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.