ప్రతిరోజూ దెబ్బలే… ఒళ్ళంతా వాతలే..!

అదో రాత్రి. జడివాన పడుతోంది. అప్పటిదాకా ఆ ఇంటి చూరు కింద- అరుగుపైన ఉంటూవచ్చిన ఆ చిన్నారి బట్టలూ, పుస్తకాలూ విసురుగా వీధిలోకి వచ్చిపడ్డాయి. అతణ్ణీ కొట్టి తోసేశారు.


వాతలు తేలిన శరీరంతో తన మాస్టారు ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. డబ్బుల్లేవు.

ఓ టీకొట్టావిడ దగ్గర కళ్ళ నీళ్ళతో చేయి చాచాడు. జాలిపడిన ఆమె రూ.75 ఇచ్చి బస్సెక్కించింది. అలా అనాథగా వెళ్ళినవాడు కాస్తా స్పెషలిస్ట్‌ డాక్టరుగా తిరిగొచ్చి రూ.50కే వైద్యం చేస్తున్నాడు! ఆ డాక్టర్‌- రజినీ కలైయరసన్‌ జీవితం… మానవతాస్ఫూర్తికి ఎత్తిన పతాక! అసామాన్య పట్టుదలకి ప్రతీక. అది అతని మాటల్లోనే…

ఓ అబ్బాయి, ఓ అమ్మాయి… ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవారు. ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడ్డారు. కులాలనీ, కుటుంబాలనీ కాదుపొమ్మని కల్యాణంతో ఏకమయ్యారు. అబ్బాయివాళ్ళ ఊరిలోనే కాపురం పెట్టారు. ఏడాది గడిచింది. అతని ఇంటివాళ్ళు దిగొచ్చి..నట్టు నటించారు. వాళ్ళని ఇంటికి పిలిచారు. ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగుపెట్టిన క్షణం నుంచీ వేధింపులు మొదలుపెట్టారు. ఆ ఆరళ్ళ మధ్యే ఆ అమ్మాయి కడుపు పండింది.

ఆ వాతావరణంలో బిడ్డను కనడానికి భయపడి- ఆమె పుట్టింటిని ఆశ్రయించింది. పరాయి కులంవాడిని పెళ్ళాడిందని వాళ్ళూ ఈసడించినా భరిస్తూ అక్కడే ఉండిపోయింది. బాబు పుట్టాడు. ఓ రోజు కన్నబిడ్డనీ భార్యనీ చూద్దామని వచ్చాడు భర్త. ఆ తర్వాతి రోజే- శవమై తేలాడు. పోలీసులు అది ఆత్మహత్య అన్నారు. ఊరు మాత్రం ‘పరువు హత్యే’ అంది. ఏదేమైనా- భర్తని కోల్పోయి పసిబిడ్డతో పుట్టింట్లోనూ పుట్టెడు కష్టాలు పడుతున్న ఆమె వద్దకొచ్చారు అత్తామామలు. ‘మా ఇంటి వారసుణ్ణి మాకిచ్చెయ్‌’ అన్నారు. ఏ ఒత్తిడి పనిచేసిందో, ఏ భయం వణికించిందో తెలియదు… ‘ఈ బిడ్డ కానీ, మీ ఆస్తికానీ నాకొద్దు…’ అని రాసిచ్చేసిందామె.

ఆ బాబుని… నేనే!

మా బాబాయి-పిన్ని తమకు గంపగుత్తగా దక్కాల్సిన ఆస్తికి నన్ను పోటీదారుగా భావించారేమో! మూడేళ్ళ వయసు నుంచే ‘కులం తక్కువదాని కొడుకువి…’ అంటూ నన్ను గుమ్మం పక్కనున్న అరుగుకే పరిమితం చేశారు. ఇంటి లోపలికి అడుగుపెడితే వాతలు తేలేలా కొట్టేవాళ్ళు. పసివాణ్ణనీ చూడకుండా రోజంతా పశువుల కొట్టంలో పనిచేయించేవాళ్ళు. అందరూ తిన్నాక- ఏమైనా మిగిలితే పెట్టేవాళ్ళు. బాబాయి-పిన్నిల ధాటికి నానమ్మ-తాతయ్యలు కీలుబొమ్మలయ్యారు. కనీసం బడిలో చేరితేనైనా నాకింత తిండి దొరుకుతుందని తాతయ్య భావించాడు. టీచర్ల కాళ్లావేళ్ళా పడి ఏడాదిన్నర వయసు ఎక్కువ వేయించి మరీ బడిలో చేర్చాడు. ఉత్తరా రెడ్డి అని మా స్కూలు హెడ్మాస్టర్‌… నా బాధ తెలుసుకుని నేను మధ్యాహ్నం దాకా వేచి ఉండక్కర్లేకుండా 10 గంటలకే అన్నం పెట్టే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత, మధ్యాహ్నం అందరితో కలిసి భోజనం చేసి- అందులో కొంత మిగుల్చుకుని ఇంటికి తీసుకెళ్ళి రాత్రికి తినేవాణ్ణి. రాగిణి అనే టీచర్‌ సెలవు రోజుల్లో నాకు అన్నం పెట్టేది. వాళ్ళ పిల్లల పాత బట్టలు ఇచ్చేది. నాకింత అన్నంపెట్టిన అలాంటి టీచర్లే నా దేవుళ్ళు కదా! అందుకే వాళ్ళ మాట జవదాటకూడదని… వాళ్ళు చెప్పినట్టే శ్రద్ధగా చదవసాగాను. ఇంటికెళితే ఎలాగూ చదవడం కుదరదు కాబట్టి- బడిలోనే చదువుకుని, హోమ్‌వర్క్‌ పూర్తి చేసుకుని వెళ్ళేవాణ్ణి. ఆమాత్రం ఆలస్యానికే ఇంట్లో చింతబరికెతో చితకబాదేవారు. ఏదేమైనా నాలుగో తరగతి నుంచీ నేనే క్లాస్‌ ఫస్ట్‌. ఐదో తరగతిలో స్కూల్‌ ఫస్టొచ్చాను. సరిగ్గా- అప్పుడే నాకు ఎంతోకొంత అండగా ఉన్న తాతయ్య చనిపోయాడు!

నేను చదువుకోవడం బాబాయికి ఇష్టంలేదు… దాంతో ఆరోతరగతిలో గార్డియన్‌గా సంతకం పెట్టమంటే పెట్టలేదు. పాత స్కూలు టీచరే సంతకం పెట్టి- నన్ను హైస్కూల్లో చేర్చారు. ఆరో తరగతిలో ‘నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఎగ్జామ్‌’లో మా హోసూరు తాలూకాలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాను. అదే ఏడాది ఓ వర్షాకాలం రాత్రి- నేను వాళ్ళని ఎదిరించానని బాబాయి- పిన్ని ఇంటి నుంచి తరిమేశారు! ఆ రాత్రి మా క్లాస్‌ టీచర్‌ మాదేశ్వర్‌ సార్‌ ఇంటికే వెళ్ళాను. ఆయనది పెద్ద సంసారం కావడంతో ఆ తర్వాతి రోజునుంచీ బడిలో తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చారు. రెణ్ణెళ్ళ తర్వాత అక్కడ ఎక్కువరోజులు ఉండడానికి రూల్స్‌ ఒప్పుకోవని చెప్పడంతో- నా క్లాస్‌మేట్‌ ప్రేమ- వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళూ పేదవాళ్ళే అయినా వాళ్ళు తినే పచ్చడి మెతుకులే నాకూ పెట్టారు. సెలవుల్లో వాళ్ళతోపాటు కూలికి వెళ్ళేవాణ్ణి. అలా వాళ్ళింట తలదాచుకునే పదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చాను. అప్పుడే తొలిసారి పత్రికలు నా గురించి వార్తలు రాశాయి. అది చూసి హోసూరులోని ఓ ప్రైవేటు స్కూలువాళ్ళు ఫ్రీ సీటిచ్చారు. లక్ష రూపాయలయ్యే హాస్టల్‌ ఖర్చూ మాఫీ చేశారు. అక్కడా అందరికీ అభిమానపాత్రుణ్ణయ్యాను. ప్లస్‌ టూ తర్వాత ఎంబీబీఎస్‌ సీటు సాధించాను. ఐదో తరగతి నుంచి ప్లస్‌ టూదాకా నాకు చదువుచెప్పిన మాస్టార్లందరూ తలాకొంత వేసుకుని నన్ను మెడికల్‌ కాలేజీకి పంపించారు. అక్కడ చేరిన రెణ్ణెళ్ళ తర్వాత ఆధార్‌ కార్డు కావాల్సొచ్చింది. నాకంటూ పర్మనెంట్‌ అడ్రెస్‌ లేదుకాబట్టి… ఇవ్వమన్నారు. దాంతో నేను కలెక్టర్‌ని కలిశాను. ఆయన ఆసాంతం విని ‘రేపొద్దున్నే వచ్చి ఆధార్‌ తీసుకోండి’ అన్నారు. తర్వాతి రోజు వెళితే నా హాస్టల్‌ రూమ్‌ అడ్రెస్‌తోనే ఆధార్‌ సిద్ధం చేశారు. దాంతోపాటూ రూ.1.96 లక్షలకి చెక్‌ కూడా ఇచ్చారు.

‘నీ పట్టుదలకీ ప్రతిభకీ నా కానుక అనుకో…’ అన్నారు. కన్నీళ్ళతో బయటకొచ్చాను ఆ రోజు.

ఎంబీబీఎస్‌ ఐదేళ్ళూ నల్లేరుపై నడకలాగే సాగింది. కానీ- రేపొద్దున చివరి ఏడాది పరీక్షలనగా ముందు రోజు రాత్రి ప్రమాదానికి గురయ్యాను. గదిలో టీ తాగుదామని గిన్నె దించుతుండగా సలసల కాగుతున్న టీ పడి… ఛాతీ నుంచి తొడదాకా చర్మం లేచొచ్చి అల్లాడిపోయాను. ఆసుపత్రిలో చేర్చారు. మెడికల్‌ కాలేజీ డీన్‌ సహా ప్రొఫెసర్లందరూ వచ్చారు. ‘రేపు పరీక్ష రాయొద్దులే’ అన్నారు. నాకేమో ఇంకో ఆరునెలలు కోల్పోవడం ఇష్టంలేదు. దాంతో- ఎలాగైనా పరీక్ష రాస్తానని మొండికేశాను. చివరికి- ఎగ్జామినేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సునీత నాకు ప్రత్యేక అనుమతినిచ్చారు. ప్యాంటు కూడా వేసుకోలేని పరిస్థితిలో- లుంగీ కట్టించి, లూజు షర్టు తొడిగించి నా కోసం ప్రత్యేక టేబుల్‌ ఏర్పాటుచేసి మరీ పరీక్ష రాయించారామె! ఎంబీబీఎస్‌ తర్వాత చర్మ వ్యాధులపైనా, పిల్లల వైద్యంలోనూ స్పెషలైజేషన్‌ చేశాను. అనాథగా ఉన్న నన్ను ఇంతవాణ్ణి చేసిన హోసూరులోనే వైద్య సేవలు అందించాలనుకున్నాను. ముందుగా చిన్న క్లినిక్‌ పెట్టాను. రూ.20 తీసుకునేవాణ్ణి అప్పట్లో. కరోనా సమయంలో ప్రభుత్వం పిలుపుమేరకు కొవిడ్‌ బాధితుల సేవల్లో పాల్గొన్నాను. అది నచ్చి- తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇచ్చారు. అక్కడా ప్రైవేటు ఆసుపత్రి ఏర్పాటుచేశాను. అందులో నాతోపాటు పనిచేసే డాక్టర్లకు కాస్తోకూస్తో జీతం ఇవ్వాలి కాబట్టి ఫీజు యాభై రూపాయలకి పెంచాను. ఇవ్వలేనివారిని అదీ అడగను.

డాక్టర్‌ని అయ్యాక అమ్మ గురించి ఎలాగైనా తెలుసుకుందామని బాబాయి ఇంటికెళ్ళాను. ఆయన కొడుకులు ఏకంగా కత్తులు తీసుకుని మీదకొచ్చారు. ‘ఆస్తి కోసం వస్తే… అంతు చూస్తాం’ అన్నారు. ‘నాకు మీ ఆస్తి అవసరం లేదు. మా అమ్మ వివరాలు మాత్రం చెప్పండి…’ అన్నాను. తెలియదని బాబాయి సహా అందరూ కోరస్‌గా పలికారు. అమ్మ రాసిన పత్రమూ లేదన్నారు.

నేను నాస్తికుణ్ణి. ఉసురు, పాపం, విధి… వంటి మాటల్ని నమ్మను. ఓ మనిషిగా- నన్నూ అమ్మనీ ఎంత రాచిరంపాన పెట్టినా సరే, వాళ్ళు చల్లగా ఉండాలనే కోరుకున్నాను. కానీ నా కళ్ళముందే మా బాబాయి కుటుంబం కుదేలైంది. పెళ్ళైన ఏడాదికి ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కొడుకు ఓ ప్రమాదంలో చనిపోయాడు. బాబాయికీ పక్షవాతంతో నోరూ కాలూచెయ్యీ పడిపోయాయి! వైద్యం కోసం ఆయన మా ఆసుపత్రికే వస్తుంటాడు. ‘బీపీ తగ్గాలి బాబాయ్‌…’ అని చెబుతుంటే దీనంగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు.