Aarambham OTT: అదిరిపోయే ట్విస్టులు.. ఓటీటీలో లేటెస్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Aarambham OTT: అదిరిపోయే ట్విస్టులు.. ఓటీటీలో లేటెస్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి. కొన్ని సినిమాలు మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తాయి. మూవీ మేకర్స్, ఓటీటీ సంస్థల ఒప్పందం మీద ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవల సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ వారం రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం దేశమంతా ఎలక్షన్లు, ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. కాబట్టి సినిమా థియేటర్లలో సందడి ఉండడం లేదు. అందుకే థియేటర్లలో రిలీజైన సినిమాలు వెంటనే ఓటీటీ బాట పడుతున్నాయి. అలా థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఓ సూపర్ హిట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే ఆరంభం. అజయ్‌ నాగ్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో మోహన్‌ భగత్‌, సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మే 10న థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరంభం సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఓ క‌న్న‌డ న‌వ‌ల ఆధారంగా టైమ్ లూప్ కాన్సెప్ట్‌కు సైంటిఫిక్ థ్రిల్లర్ అంశాలను జోడించి ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఆద్యంతం ఆకట్టుకునే కథనం, ట్విస్టులు ఉండడంతో సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి.
ఇలా థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఆరంభం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 23 నుంచే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. అంటే థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుందన్న మాట.

సినిమా కథ ఏంటంటే.. ఓ హత్యకేసులో రెండున్నరేళ్లు జైలు జీవితం గడుపుతాడు మిగిల్‌ అనే వ్యక్తి. ఉరిశిక్ష ఖరారు కాగా జైలు నుంచి పారిపోతాడు. భారీ భద్రత ఉండగా అతడెలా కారాగారం నుంచి తప్పించుకున్నాడో తెలుసుకునేందుకు డిటెక్టివ్‌ రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో డిటెక్టివ్‌కి మిగిల్‌కు సంబంధించిన పుస్తకం ఒకటి వెలుగులోకి వస్తుంది. అందులో ఉన్న డెజావు కాన్సెప్ట్‌ ఏంటి? దాని గురించి మిగిల్‌కు చెప్పిందెవరు? అసలు అతడు హత్య చేశాడా, లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఆరంభం సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.