కాలుష్యం వల్ల కళ్లకు సమస్యలా.. ఉపశమనం కోసం ఈ చిట్కాలు పాటించండి

www.mannamweb.com


వాతావరణంలో చలి పెరగడంతో పాటు గాలిలో కాలుష్యం కూడా పెరిగింది. కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్యల నుంచి నివారణ కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, మాస్క్ ఉపయోగించడం ప్రారంభిస్తారు.

అయితే గాలిలో కలిసిన కాలుష్యం కళ్లపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. గాలిలో ఉండే టాక్సిన్స్ వల్ల కళ్లు ఎర్రబడడం, కళ్ల నుంచి నీళ్లు కారడం, దురద, మంట, పొడిబారడం వంటి సమస్యలు మొదలవుతాయి. వీటిని నివారించడానికి బయటికి వెళ్లే సమయంలో కళ్ళ జోడును ఉపయోగించండి. ఇది UV కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి కళ్ళను కాపాడుతుంది.

కళ్ళు శరీరంలో చాలా సున్నితమైన అవయవాలు. కనుక కళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. గాలిలో కలిసిన విష పదార్థాల వల్ల కలిగే హాని నుంచి కళ్ళను రక్షించుకోవడానికి కళ్ళ అద్దాలు ధరించాలి. తేలికపాటి లక్షణాలు కనిపిస్తే ఉపశమనం పొందడానికి కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించండి.

కోల్డ్ కంప్రెస్ ఉపశమనాన్ని అందిస్తుంది

కళ్ళు చాలా అలసిపోయినట్లు లేదా కళ్ళు నొప్పిగా అనిపిస్తే కోల్డ్ కంప్రెస్ చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. దీని కోసం నిద్రపోయే కొద్దిసేపటి ముందు ధరించగలిగే కంటి ప్యాడ్‌లను మార్కెట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అంతే కాదు శుభ్రమైన గుడ్డ స్ట్రిప్‌ను నీటిలో నానబెట్టి.. కొద్దిసేపు కళ్లపై ఉంచడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.

పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ

కాలుష్యం కారణంగా కళ్లలో దురద, ఎరుపు వంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తే పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కంటిని తాకే ముందు చేతులను కడుక్కోండి. ఎందుకంటే బ్యాక్టీరియా చేతుల ద్వారా కళ్ళలోకి ప్రవేశిస్తే కంటి సమస్య పెరుగుతుంది. అంతేకాదు కళ్లను మళ్లీ మళ్లీ రుద్దడం లేదా తాకడం వంటివి చేయవద్దు.

కళ్ళను నీటితో శుభ్రపరచుకోండి

బయటి నుంచి ఇంటికి వచ్చినా లేదా ఆఫీసుకు చేరుకున్నా.. కళ్ళను నీటితో శుభ్రం చేసుకోండి. పని చేస్తున్న సమయంలో కళ్ళు బాగా అలసిపోతే కళ్ళను సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఈ విధానాన్ని క్రమం తప్పకుండా పాటించండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి

కాలుష్యం మధ్య కళ్ళుతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మంచి ఆహారాన్ని అందించండి. తినే ఆహారంలో విటమిన్ సి, ప్రోటీన్, విటమిన్ ఎ, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి. అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన పొడి కళ్ల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది.

ఈ విషయాన్ని గుర్తుంచుకోండి..

కాలుష్యం వల్ల లేదా మరేదైనా కారణాల వల్ల కంటి సమస్య తలెత్తితే వైద్యులను సంప్రదించడం మంచిది. కళ్ళు ఎర్రగా మారడం, నొప్పి, మంట, దురద తదితర సమస్యలు కాస్తైనా ఇబ్బంది పెడితే వెంటనే ఆ సమస్యలకు చెక్ పెట్టడం మంచిది.