Fake Gold: చైనాలో ‘999 గోల్డ్‌’ మోసాలు – భారత్‌కూ వ్యాపించొచ్చు, జాగ్రత్త!

www.mannamweb.com


999 Gold Scams: బంగారం అంటే భారతీయులకు అమితమైన మోజు. మన పొరుగున ఉన్న చైనీయులకు కూడా పసిడి అంటే పిచ్చి. బులియన్‌ మార్కెట్‌లో ఇటీవలి బూమ్‌తో, చీనీ ప్రజలకు బంగారం ఒక బంగారు బాతులా కనిపించింది. ఎల్లో మెటల్‌పై వ్యామోహం ఎక్కువైంది. దీంతో పాటే అక్కడ గోల్డ్‌ స్కామ్‌లూ విపరీతంగా పెరిగాయి.

“999 గోల్డ్‌” మోసాలు
చైనాలో, ఆన్‌లైన్‌ ద్వారా “999 గోల్డ్‌” పేరుతో బంగారం అమ్ముతున్నారు, మార్కెట్‌ రేట్‌ కంటే కాస్త తక్కువ రేటును ఆఫర్‌ చేస్తున్నారు. గోల్డ్‌ రేటు ఎప్పటికప్పుడు పెరగడంతో పాటు బంగారం డిస్కౌంట్‌లో దొరుకుతుండడంతో 999 గోల్డ్‌ కొనడానికీ చైనీయులు ఎగబడ్డారు. సేవింగ్స్‌ను ‘సేఫ్‌ హెవెన్‌’లోకి (బంగారం) మార్చుకున్నారు. అయితే, తాము కొన్నది “నకిలీ బంగారం” అని, అత్యాసకు పోయి అడ్డంగా బుక్కయ్యామని వేల మందికి ఆలస్యంగా తెలిసింది.

సాధారణంగా, స్వచ్ఛమైన బంగారాన్ని “999 గోల్డ్‌” అని పిలుస్తారు. దీనిలో 99.9% బంగారం ఉంటుంది. దీనిని 24 క్యారెట్ గోల్డ్‌గా కూడా చెబుతారు. చైనాలో “999 గోల్డ్‌” పేరిట ఆన్‌లైన్‌లో అమ్ముతుండడంతో, అది నిజమైన బంగారమనే భ్రమతో కొంటున్న చైనా ప్రజలు నిలువునా మోసపోతున్నారు. ఇప్పుడు, చైనాలో నకిలీ బంగారం కూడా ప్రధాన సమస్యల్లో ఒకటిగా మారిందంటే, కేటుగాళ్లు ఏ రేంజ్‌లో రెచ్చిపోయారో అర్ధం చేసుకోవచ్చు.

చైనా ఆధునిక తరానికి స్వచ్ఛమైన బంగారానికి – తక్కువ నాణ్యత గల బంగారానికి తేడా తెలీడం లేదు. అదే సమయంలో డిమాండ్‌ పెరిగింది. ఈ పరిస్థితి స్కామర్లకు (మోసగాళ్లు) చక్కగా కలిసొచ్చింది. గోల్డ్‌ మోసాల వార్తలు అక్కడి లోకల్‌ మీడియాలో నిత్యం వస్తున్నాయి.

రెండు కేస్‌లను పరిశీలిస్తే.. ఓ వ్యక్తి 1,985 చైనీస్ యువాన్లకు (సుమారు $280) ఐదు బంగారు పెండెంట్‌లు కొన్నాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి వాటి కింద మంటపెడితే, ఆ బంగారం నకిలీదని తేలింది. వేడి తగిలినప్పుడు నకిలీ బంగారం ముదురు రంగులోకి/ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. స్వచ్ఛమైన బంగారం మాత్రం మరింత ప్రకాశిస్తుంది. మరో కేస్‌లో.. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో కొన్న బంగారానికి తుప్పు పట్టడం గమనించాడు. స్వర్ణకారుడి దగ్గరకు తీసుకెళ్తే, అది కాకి బంగారమని తెలిసింది.

అసలు వర్సెస్ నకిలీ – ఎలా గుర్తించాలి?

నకిలీ బంగారం కేసులు పెరగడంతో చైనా ప్రభుత్వం రంగంలోకి దిగింది. అసలు బంగారాన్ని ఎలా గుర్తించడానికి కొన్ని చిట్కాలు చెప్పింది.

– కంచు మోగినట్లు కనకంబు మోగదు. బండ మీద జారవిడిచినప్పుడు స్వచ్ఛమైన బంగారం తక్కువ శబ్ధం చేస్తుంది.

– నగల మీద నైట్రిక్ యాసిడ్‌ ప్రయోగం. యాసిడ్ చుక్క వేసిన తర్వాత ఆ ప్రాంతం ఆకుపచ్చ రంగులోకి మారితే.. అది బంగారు పూతతో వేరే లోహమని గుర్తించాలి. రంగు మారకపోతేనే అది అసలు బంగారమని లెక్క.

ఇలాంటి పరీక్షలేవీ అక్కర్లేకుండా.. బంగారంతో బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నగ పరిమాణం, దాని బరువు బరువు ఆధారంగా అది అసలో, నకిలీయో కనిపెట్టగలరు.

పసిడి కొనుగోళ్లలో దగా పడకుండా ఉండాలంటే, ప్రసిద్ధ నగల దుకాణాల్లో మాత్రమే కొనాలని కూడా చైనీస్‌ గవర్నమెంట్‌ తన ప్రజలకు సూచించింది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం.. చైనీస్ కస్టమర్లు 2023లో 603 టన్నుల గోల్డ్‌ జువెలరీ కొన్నారు. చేశారు. 2022తో పోలిస్తే కొనుగోళ్లు 10% పెరిగాయి. 2023లో, ఆభరణాల కొనుగోళ్లలో భారత్‌ను చైనా అధిగమించింది, ప్రపంచంలోనే అతి పెద్ద కొనుగోలుదారుగా అవతరించింది.

ఇటీవలి కాలంలో రికార్డ్‌ స్థాయికి చేరిన ఎల్లో మెటల్‌ రేటు, గత వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు (28.35 గ్రాములు) 2,314 డాలర్ల వద్ద ఉంది.