కెన్యాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 12మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం కెన్యాలోని క్వాలే కౌంటీలో విమానం కూలింది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న విమానం డయాని నుండి మాసాయి మారాలో కిచ్వా టెంబోకు బయలుదేరింది. అయితే బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమాన ప్రమాదాన్ని కెన్యా పౌర విమానయాన అథారిటీ (కేసీఏఏ) ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
‘డయాని నుండి కిచ్వా టెంబోకు వెళుతున్న 5Y-CCA రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన విమానం ఉదయం 8.30 గంటల సమయంలో కూలిపోయింది. విమానంలో 12మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు , దాని ప్రభావాన్ని నిర్ధారించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లారు’ అని కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటనలో పేర్కొంది.
పోలీసుల ప్రకారం.. విమాన ప్రమాదంలో మరణించిన 12 మంది ప్రయాణికులు పర్యాటకులని తేలింది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని పరిశీలించడానికి,దర్యాప్తు చేయడానికి ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నాయని కేసీఏఏ డైరెక్టర్ ఎమిలే ఎన్.రావు తెలిపారు.
ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ విషాదం చోటు చేసుకుందని స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుండి, తీరప్రాంతం పొగమంచు, మేఘాలతో కప్పబడి ఉండటం వల్ల పైలట్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ కథనాల్లో హైలెట్ చేశారు.
































