ఏపీలో వేలాదిమంది విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. పాత బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దశలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేందుకు సిద్ధమవుతోంది. వైసిపి హయాంలో చాలావరకు బిల్లులు పెండింగ్ లో ఉండిపోయాయి. తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు, బకాయిలు చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మరోవైపు ఇదే అంశంపై పోరాటం ప్రారంభించనుంది వైసిపి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరపడానికి నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించింది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. వేలాదిమంది ఫీజు రీయంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు ప్రాధాన్యత క్రమంలో నిధుల విడుదలకు హామీ ఇచ్చారు.
* ఆందోళనలో తల్లిదండ్రులు
ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కాలేజీల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు. అప్పటి వైసీపీ సర్కార్ హామీతో చాలామంది ప్రైవేట్ కాలేజీల్లో చేర్పించారు తమ పిల్లలను. వారందరికీ ఇప్పుడు ఫీజుల ఒత్తిడి ఎదురవుతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనిపై పలుమార్లు మంత్రి నారా లోకేష్ స్పందించారు. త్వరలో ఫీజు రీయంబర్స్మెంట్ చెల్లింపులు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు క్యాబినెట్ సమావేశంలో అదే విషయంపై ప్రస్తావించడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. దశలవారీగా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే సమయంలో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
* దశల వారీగా చెల్లింపులు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ నిధులను చెల్లించనుంది. దశలవారీగా చెల్లించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల పై పెడుతూ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులకు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలో ఇబ్బందులు పెట్టొద్దని కూడా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను అధిగమించే క్రమంలో ఉన్నామని చెప్పుకొచ్చారు. మంత్రి నారా లోకేష్ అభ్యర్థన మేరకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. మొత్తానికైతే ఫీజు రీయంబర్స్మెంట్ విషయంలో కదలిక ప్రారంభం కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చెల్లింపులు పూర్తి చేయాలని కోరుతున్నారు.