ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో పూర్తి స్థాయి పర్యవేక్షణకు నిర్ణయించింది. ఇందుకోసం కొత్తగా మూడు అంచెల విధానం తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెద్ద సంఖ్యలో కొత్త పోస్టులు మంజూరు చేసారు. డిప్యుటేషన్ పైన సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు. ఇక, ప్రస్తుత సచివాలయ సిబ్బంది పర్యవేక్షణ.. విధుల కేటాయింపులోనూ ప్రభుత్వం తాజా నిర్ణయాల అమలుకు సిద్దం అయింది.
మూడంచెల వ్యవస్థ
ఏపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేసేందుకు శ్రీకారం చుట్టిన గ్రామ/వార్డు సచివాలయాల శాఖ.. తాజాగా మండల, మున్సిపల్, జిల్లా స్థాయిలో సచివాలయాలను పర్యవేక్షించడానికి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో 2778 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, 1785 పోస్టులను డిప్యుటేషన్ / ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు, మరో 993 కొత్త పోస్టులు సృష్టించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో గ్రామవార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయం, డైరెక్టరేట్ స్థాయిలో ఇందు కోసం పంక్షనల్ అసిస్టెంట్ పేరుతో12 పోస్టులను మంజూరు చేశారు.
పోస్టుల మంజూరు
జిల్లా స్థాయిలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 2,231 పోస్టులను మంజూరు చేశారు. జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి, సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ కోఆర్డినేటర్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్టినేట్, మండల గ్రామ, వార్డు సచివాలయాల అధికారి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేశారు. నగరాలు, పట్టణాల్లో మరో 535 పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఈ మూడంచెల వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం అమలుకు విధి విధానాలు ఖరారు చేసారు. ఆయా మండలాలు/పట్టణ స్థానిక సంస్థల నుంచి 1,785 మందిని డిప్యుటేషన్‌పై వినియోగించుకోనున్నారు.
నియామకాలు ఇలా
993 కొత్త ఏఎన్‌ఎం/వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను సృష్టించనున్నారు. మండల స్థాయిలో పంచాయతీరాజ్‌శాఖ ఫస్ట్ లెవల్ గెజిటెడ్ అధికారిని మండల గ్రామ/వార్డు సచివాలయ అధికారి గా నియమిస్తారు. ఇందుకోసం 660 మందిని డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. మండలాల్లో 1,320 మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యుటేషన్‌పై నియమిస్తారు. అదే విధంగా పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజినల్ డైరెక్టర్ కమ్ అప్పిలేట్ కమిషనర్లు, ఆరుగురు సెలెక్షన్ గ్రేడ్/జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను అదనపు కమిషనర్లుగా.. మరో 9 మందిని జిల్లా గ్రామ/వార్డు సచివాలయ శాఖ అధికారులుగా డిప్యుటేషన్‌పై నియమించాలని నిర్ణయించారు.
































