Kailasagiri Vizag: కైలాసగిరిపై మంటలు.. అధికారుల పరుగులు

విశాఖలో ప్రముఖ పర్యటన ప్రాంతం అది.. ఆ కొండా ఎక్కితే విశాఖ సముద్రంతో పాటు నగర అందాలన్నీ ఆస్వాదించవచ్చు. కొండపైకి రోడ్డు మార్గం తో పాటు, రోప్ వే అత్యంత ఆకర్షణ. టాయ్ ట్రైన్ రైడింగ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పుడు మరిన్ని పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. దీంతో నిత్యం పర్యాటకులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతూ ఉంటుంది. అంతటి ప్రాధాన్యత పర్యాటక ప్రాధాన్యత ఉన్న కైలాసగిరి కొండపై ఒక్కసారి అలజడి చెలరేగింది. దట్టంగా పొగ కొమ్ముకుని, మంటలు చెలరేగాయి. కొండపై ఉన్న వారు హైరానా పడ్డారు. కొండ దిగువ ఉన్నవారు కూడా ఆ దట్టమైన పొగ చూసి భారీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భయపడ్డారు. వీడియోలు తీసి చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈలోగా అధికారులకు సమాచారం అంది పరుగులు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగిపోయారు.


కైలాసగిరిపై ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు చెలరేగాయి. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే.. రోప్‌వే ఆగేచోట ఎండుటాకులు, చెత్తగా ఉండడంతో అక్కడి సిబ్బంది వాటికి మంట పెట్టారు. అక్కడ నుంచి వాళ్లు విధుల్లోకి వెళ్లిపోయారు. ఆ మంటలకు కొండపై గాలి తోడై పక్కనున్న చెట్లు ఆకులకు పాకాయి. అక్కడే పడేసిన పాత టైర్లకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈలోగా కొండపై దట్టమైన పొగలు కమ్ముకున్నాయనే సమాచారంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగిపోయారు. మంటలను అదుపు చేశారు. అసలు విషయం తెలుసుకుని ఊపిరి పిలుచుకున్నారు.

అయితే ఈ విషయంపై విచారణకు ఆదేశించారు కలెక్టర్ హరేందిర ప్రసాద్. వీఎమ్ఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ ఘటనస్థలిని పరిశీలించారు. ఈ విషయం గుర్తించి రోప్‌ వే కాంట్రాక్టర్‌ను కమిషనర్‌ మందలించారు. కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ తరువాత వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్.. కైలాసగిరి పై తిరిగి అవసరమైనచోట్ల ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని వెల్లడించారు కలెక్టర్ హరేందిర ప్రసాద్. అసలు విషయం తెలుసుకున్న పర్యాటకులు, విశాఖ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.