పేదింట్లో మెరిసిన ఆణిముత్యం.. ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యవసాయ కూలీ బిడ్డ

చదువుకు పేదరికం అడ్డు కాదని ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన యువతి జ్యోతి శిరీష నిరూపించింది.


ప్రభుత్వ గురుకుల రెసిడెన్షియల్‌లో చదివి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం పౌలు శారమ్మ దంపతులు వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరీష చిన్న కుమార్తె స్పందన మిట్టపల్లి గ్రామంలోని సెయింట్ మేరీస్ స్కూల్ తోపాటు ఖమ్మంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.

పెద్ద కుమార్తె జంగం జ్యోతి శిరీష చిన్నతనం నుండే చదువుపై మక్కువ చూపించడంతో తల్లిదండ్రులు కష్టపడి ఆమెను ప్రోత్సహించారు. ఇంటర్ డిగ్రీ తోపాటు పీజీ బీఈడీ పూర్తిచేసిన జ్యోతి శిరీష యుపిఎస్సి పై మక్కువ చూపించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన యుపిఎస్సి కోచింగ్ సెంటర్‌లో విద్యను అభ్యసించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టులతో పాటు టీఎస్పీఎస్సీ గ్రూప్ ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరైంది. ఒకే సంవత్సరంలో వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయింది.

మొదటిగా గురుకుల రెసిడెన్షియల్ లో గురుకుల టీచర్‌గా ఎంపిక కావడంతో ఉద్యోగ బాధ్యతల్లో చేరారు. అనంతరం గ్రూప్ 4, తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక కావడంతో వైరాలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, సోషల్ టీచర్‌గా జాయిన్ అయింది. మరల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి సూపర్‌వైజర్‌గా ఎంపికైనా, ఉపాధ్యాయురాలుగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంది. అయితే తాజాగా గ్రూప్ వన్ పరీక్షలకు హాజరై రాష్ట్రస్థాయిలో 604 ర్యాంకు సాధించి మల్టీ జోన్ వన్ లో 159 వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 25వ ర్యాంక్, మహిళా కోటాలో ఏడో ర్యాంకు సాధించింది.

నిరుపేద కుటుంబంలో జన్మించి ఒకే సంవత్సరంలో ఐదు ఉద్యోగాలకు ఎంపికై, గ్రూప్ వన్ పరీక్షల్లో రాష్ట్రా స్థాయిలో మంచి ర్యాంకు సాధించడం పట్ల కుటుంబీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ కాలం ఎక్కువ ఉద్యోగాలు సాధించినందుకు స్థానికులు పలువురు ప్రముఖులు జ్యోతి శిరీషను అభినందించారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న అమ్మా-నాన్నలు ఆడపిల్లలు అని అధైర్య పడకుండా తమను కష్టపడి చదివించారని జ్యోతి శిరీష తెలిపారు. చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలని పట్టుదలతో ఉత్తమ ర్యాంకులు సాధించానని దాని ఫలితంగానే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆమె తెలిపారు. తన చదువుకు అమ్మ నాన్నలే కాకుండా తన మామయ్య భాస్కర్ అమ్మమ్మ తాతయ్యలు ప్రోత్సహించారని తెలిపారు. భవిష్యత్తులో ఐఏఎస్ లక్ష్యంగా పెట్టుకున్నానని, కలెక్టర్‌గా పేదవారికి సేవలందించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని తెలిపారు. గ్రూప్ వన్ ద్వారా వచ్చిన ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని జ్కయోతి శిరీష తెలిపారు.

నిరుపేద కుటుంబంలో పుట్టి వ్యవసాయ కూలీలుగా, భవన నిర్మాన కార్మికులుగా పనిచేస్తున్నామని యువతి తండ్రి జంగం పౌలు తెలిపారు. ఇద్దరు అమ్మాయిలను మనోధైర్యం చెందకుండా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కష్టపడి పని చేసి, వారిని విద్యను అభ్యసించేందుకు కృషి చేశామని తెలిపారు. తమ పెద్ద కుమార్తె జ్యోతి శిరీష చిన్నతనం నుండి చదువులో మంచి ర్యాంకులు సాధించిందని, ఆమె పట్టుదల చూసే, ఉన్నత విద్యను అందించేందుకు సహాయం చేశామని తెలిపారు తమ కుమార్తెను కలెక్టర్‌గా చూడాలన్నదే తన ఆశ అని అన్నారు.