ఏపీలో కలిపిన ఐదు గ్రామాలు ఇవ్వాల్సిందే! : ఎమ్మెల్సీ కవిత

 రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.


పోలవరంతో భద్రాచలానికి ముప్పేనని చెప్పారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘పోలవరం తెలంగాణపై జలఖడ్గం ముంపుగోడు’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో భద్రాచలం ముంపు ప్రాంత బాధితులు కూడా హాజరయ్యారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల గుండాల, ఎటపాక, పిచ్చుకలపాడు, పురుషోత్తంపురం, కన్నాయిపల్లి గ్రామాలు ముంపు ప్రమాదంలో ఉన్నాయని కవిత తెలిపారు. పోలవరం స్పిల్‌వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులకు బదులు 50 లక్షల క్యూసెక్కులకు నిర్మిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల సమీప గ్రామాలకు మరింత ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కరకట్టల ఎత్తును పెంచితేనే గ్రామాలకు రక్షణ ఉంటుందని సూచించారు. 25న ప్రధాని మోదీతో జరిగే సమావేశం ద్వారా ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేయాలని కవిత డిమాండ్ చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.