భారతదేశంలో మధ్య, దిగువమధ్య ఆదాయ వర్గానికి చెందిన ప్రజలు నిరంతరం తమకు ఉన్నంతలో డబ్బును పొదుపు చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వారు ఎక్కువగా నమ్మే సంస్థల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం అందరి చూపు చాలా మందికి పరిచయం లేని సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉంది.
ఈ క్రమంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సంస్థ సరికొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లతో ప్రజల ముందుకు వచ్చింది. సాంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు భిన్నంగా ఈ లిక్విడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పనిచేస్తాయి. వీటిలో అధిక వడ్డీ ఆదాయం పొందటానికి వెసులుబాటుతో పాటు కావాల్సినప్పుడు డబ్బును సేవింగ్స్ అకౌంట్ మాదిరిగా కావాల్సినప్పుడు వెనక్కి తీసుకోవటానికి వెసులుబాటు కల్పించబడింది. అత్యవసరంగా నిధులు అవసరమైన సమయంలో వీటి నుంచి పెట్టుబడిదారులు అవసరమైన మెుత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.
ఏంటి ఈ బీఓబీ లిక్విడ్ ఎఫ్‌డి..? దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్లెక్సీ విత్ డ్రా అవకాశంతో డిపాజిట్లను సేకరించేందుకు కొత్త లిక్విడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఉదాహరణకు దీనికింద ఎవరైనా ఖాతాదారులు రూ.5 లక్షలు డిపాజిట్ చేశారనుకుంటే.. అత్యవసరంగా ఇందులో నుంచి రూ.లక్ష విత్ డ్రా చేసుకున్నట్లయితే మిగిలిన రూ.4 లక్షలు డిపాజిట్ కొనసాగుతుంది. అలాగే ముందుగా అంగీకరించిన వడ్డీ రేటునే బ్యాంక్ మిగిలిన మెుత్తంపై కూడా కొనసాగిస్తుంది. ఇక్కడ ముందుగా డ్రా చేసుకున్న మెుత్తానికి ప్రీపేమెంట్ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. బీఓబీ లిక్విడ్ ఎఫ్‌డి ముఖ్యాంశాలు..
– కనీస డిపాజిట్ మొత్తం: రూ.5,000 – గరిష్ట డిపాజిట్ మొత్తం: గరిష్టంపై ఎలాంటి పరిమితి లేదు – కనిష్ట వ్యవధి: 12 నెలలు – గరిష్ట వ్యవధి: 60 నెలలు – వడ్డీ రేటు: బ్యాంకు ఎప్పటికప్పుడు నిర్ణయించే టర్మ్ డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం – పాక్షిక ఉపసంహరణ సౌకర్యం: ఎఫ్‌డి కాల వ్యవధిలో అవసరమైనన్ని సార్లు రూ.1,000 గుణిజాల్లో అనుమతించబడుతుంది.
పెనాల్టీల వివరాలు.. రూ.5 లక్షల వరకు చేసే డిపాజిట్లపై ఎలాంటి ప్రీ పేమెంట్ పెనాల్టీ ఉండబోదని బ్యాంక్ వెల్లడించింది. అలాగే రూ.కోటి వరకు చేసే డిపాజిట్లపై 1 శాతం వరకు ఆఫర్ చేసిన వడ్డీ తగ్గించబడుతుంది. రూ. కోటి కంటే ఎక్కువ మెుత్తాల విషయంలో ఇది 1.5 శాతం వరకు ఉంటుందని బ్యాంక్ వెల్లడించింది. ఎవరైనా వ్యక్తులు బ్యాంకును సందర్శించటం ద్వారా లేదా డిజిటల్ బ్యాంక్ యాప్స్, వెబ్ సైట్ ద్వారా దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయవచ్చు.