‘ఓ తల్లికి కడుపుకోత’! – జిల్లా కేంద్రాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై వెలసిన ఫ్లెక్సీలు

టెక్కలిలో జిల్లా కేంద్రాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ‘ఓ తల్లికి కడుపుకోత’ పేరిట వెలసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి.


టెక్కలి మండలం రావివలస పంచాయతీ చిన్ననారాయణపురానికి చెందిన దాసరి మురళి, నిరోషా దంపతుల కుమారుడు సాయివినీత్‌(12).. మే 21న తోటిపిల్లలతో కలిసి క్రికెట్‌ ఆడాడు. పొదల్లోకి బాలు వెళ్లగా.. దాన్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన సాయివినీత్‌కు ఏదో కరవడంతో..

కాసేపటికి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆ బాలుడ్ని కుటుంబ సభ్యులు టెక్కలిలోని జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు. వైద్యసిబ్బంది ఆ బాలుడికి ముల్లు గుచ్చి ఉంటుందేమోనని భావించి.. సుమారు రెండు గంటలపాటు నిర్లక్ష్యం చేసి..

తూతూమంత్రంగా వైద్యసేవలందించారు. చివరికి బాలుడి పరిస్థితి విషమించడంతో చేతులెత్తేసి.. శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(రిమ్స్‌)కి రిఫర్‌ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా..

నరసన్నపేట చేరుకునేసరికి బాలుడి పరిస్థితి మరింత విషమించింది. అక్కడ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా సాయివినీత్‌ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఒక్కగానొక్క కుమారుడు కళ్లెదుటే మృతి చెందడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది.

22న ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. కాగా.. తమ కుమారుడు జ్ఞాపకాలు వెంటాడుతునే ఉండడంతో ఆ దంపతులకు కన్నీళ్లు ఆగడం లేదు.

తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో.. ‘ఓ తల్లికి కడుపుకోత’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ టెక్కలిలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘మాకు కడుపుకోత మిగిల్చిన మీకు శ్రద్ధాంజలి. పాముకాటుకు, ముళ్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని వారికి శతకోటి వందనాలు’ అంటూ వైద్యుల నిర్లక్ష్యం తీరును ఎండగట్టారు. ఇప్పటికే రిఫరల్‌ ఆస్పత్రిగా పేరొందిన జిల్లాకేంద్రాసుపత్రిలో వైద్యుల తీరు మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు చేపట్టాలని పలువురు వేడుకుంటున్నారు.