తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాలను(ఈవీ) ప్రోత్సహిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తెచ్చిన విద్యుత్తు బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్‌ఆర్ రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ.. మూడు, నాలుగు వారాల తర్వాత హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు నడుస్తాయని, తదుపరి విజయవాడ-విశాఖ మధ్య ప్రారంభిస్తామని తెలిపారు. సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు రూ.99తో హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అయిదు గంటల్లో బస్సులు గమ్యానికి చేరుతాయన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు తమ బస్సుల్లోనూ వర్తిస్తాయని వివరించారు. 49 మంది ప్రయాణించే సదుపాయం ఉందని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్‌లతో బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు.
































