APకి కేంద్రం నుంచి నిధుల వరద.. ఫండ్స్ రాకతో సీఎం చంద్రబాబు దూకుడు

www.mannamweb.com


కేంద్రం సహకారం ఏపీకి నూతనోత్తేజాన్ని ఇస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కారుతో.. కీలక ప్రాజెక్టులకు వడివడిగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టార్గెట్‌ ఫిక్స్ చేసుకుని.. పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉండటంతో.. సీఎం చంద్రబాబు అడిగివన్నీ ఇచ్చేందుకు, విభజన హామీలు నెరవేర్చేందుకు.. పార్లమెంట్‌ వేదికగానే నిధుల వరద పారించింది. అమరావతికి 15వేల కోట్ల రుణం, అవసరాన్ని బట్టి అదనపు నిధులు ఇస్తామని బడ్జెట్‌లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రాజధానిలో పరుగులు పెట్టించేందుకు కేంద్ర రుణంపై ఫోకస్‌ చేసిన సీఎం చంద్రబాబు.. ఢిల్లీలోని పెద్దలను కలిసొచ్చారు. త్వరగా డబ్బులిప్పించాలని కోరడంతో.. వరల్డ్ బ్యాంక్, ఏషియా డెవలప్‌మెంట్ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి.. నిధుల విడుదలకు సూత్రప్రాయ అంగీకారం తెలిపి వెళ్లారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య అంశాలలో రెండోది పోలవరం. 25వేల కోట్ల మొదటి దశ ప్రాజెక్టు అంచనాలలో ఇంకా రాష్ట్రానికి 12 వేల కోట్లు రావాల్సి ఉంది. వీటిపై ఇటీవలే ప్రధాని, హోంమంత్రి, జలవనరుల మంత్రిని సీఎం చంద్రబాబు కలిసి వచ్చారు. దీంతో.. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పోలవరం నిధుల అంశాన్ని చేర్చి.. షెడ్యూల్‌ ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరం 6వేల కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 6 వేల 157కోట్లు చెల్లించేందుకు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. కేంద్రం నిధులు ఇస్తుండటంతో.. 2029లోపు పోలవరం కంప్లీట్ చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ప్రస్తుతం 990 కోట్లతో వచ్చే రెండు సీజన్లలోపే డయా ఫ్రమ్ వాల్ పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది ప్రభుత్వం. ఈలోపే విశాఖకి తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం ఎడమ కాల ద్వారా నీటిని అందించేందుకు అవసరమైతే లిఫ్టింగ్ కూడా చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

ఇక విభజన హామీల్లో మరొక కీలకమైన హామీ విశాఖ, విజయవాడలో మెట్రో రైల్. ఇందుకోసం అంచనాలు పంపించాలని తాజాగా కేంద్రమే కోరింది. అమరావతిలో 26వేల కోట్లు, విశాఖలో 17వేల కోట్లు దాదాపు 40 వేల కోట్లతో… రెండు దశలలో మెట్రో నిర్మాణానికి వారం పది రోజుల్లో అంచనాలను పూర్తి చేసి కేంద్రానికి పంపనుంది రాష్ట్ర సర్కార్. విశాఖ, విజయవాడలో మెట్రోకు ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధం చేశారు. ఇక కేంద్రం కొత్తగా ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్లలో రాష్ట్రం మీదుగా మూడు కారిడార్లు వెళ్లబోతున్నాయి. విశాఖపట్నం-చెన్నై.. హైదరాబాద్- చెన్నై.. హైదరాబాద్ -బెంగళూరు కారిడార్ల వల్ల రాష్ట్రానికి భారీగా ప్రయోజనం కలగనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్, కడప జిల్లా కొప్పర్తిలో దాదాపు 5వేల కోట్ల రూపాయల నిధులతో ఏర్పడబోతున్న ఈ క్లస్టర్ల ద్వారా లక్ష ఇరవై వేల మందికిపైగా ఉపాధి లభించబోతోంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులను కూడా వెంటనే ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.

రాజధాని సహా.. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు 2400 కోట్లు కేంద్రం కేటాయించగా.. ఇప్పటికే 1500 కోట్లు రిలీజ్ చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులు 1450 కోట్లు రావడంతో.. వాటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. కేంద్ర నిధుల వరదతో.. క్షణం ఆలస్యం చేయకుండా కార్యాచరణ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. నాలుగేళ్లు టార్గెట్‌గా పెట్టుకుని దశలవారీగా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో.. ముందుకెళ్తుంది.