ప్రస్తుత తరుణంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కోవడంతోపాటు ఆలస్యంగా భోజనం చేయడం, మెడిసిన్లను వాడడం వంటి కారణాల వల్ల చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు.
దీంతో రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. అయితే కొన్ని రకాల ఆహారాలను రోజూ రాత్రి భోజనం అనంతరం తీసుకున్నట్లయితే దాంతో మైండ్ రిలాక్స్ అవడమే కాకుండా పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారని, నిద్ర కూడా చక్కగా పడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిద్ర బాగా పట్టాలంటే అందుకు ట్యాబ్లెట్లను వాడాల్సిన పనిలేదు, మద్యం సేవించాల్సిన అవసరం అసలే లేదు. పలు ఆహారాలను రోజూ రాత్రి పూట తీసుకుంటే చాలని అంటున్నారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కివి పండ్లు..
రోజూ రాత్రి భోజనం చేసిన అనంతరం కివి పండ్లను తింటే మైండ్ రిలాక్స్ అవుతుంది. గాఢ నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కివి పండును తినడం వల్ల మన శరీరంలో సెరొటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది హ్యాపీ హార్మోన్. కనుక మన మూడ్ మారుతుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్ర గాఢంగా వచ్చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం రాత్రి పూట భోజనం చేసిన తరువాత కివిని నాలుగు వారాల పాటు తిన్న పేషెంట్లలో నిద్ర బాగా పట్టిందట. కివి పండ్లను తినని వారిలో నిద్ర సరిగ్గా పట్టలేదట. అలాగే కివి పండ్లను తిన్నవారు రాత్రి పూట నిద్ర లేచే సంఖ్య కూడా తగ్గిందని సైంటిస్టులు చెబుతున్నారు. కివి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నిద్ర బాగా వచ్చేలా చేస్తాయని అంటున్నారు. కనుక రోజూ రాత్రి భోజనం అనంతరం ఒక కివి పండును తింటుంటే గాఢ నిద్రలోకి జారుకోవచ్చు.
గుమ్మడికాయ విత్తనాలు..
గుమ్మడికాయ విత్తనాలను తింటున్నా కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. గుమ్మడికాయ విత్తనాల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ విత్తనాలను తింటే శరీరంలో మెగ్నిషియం శాతం పెరుగుతుంది. ఇది నిద్రను ప్రోత్సహిస్తుంది. దీంతో పడుకున్న వెంటనే గాఢంగా నిద్ర పడుతుంది. గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల శరీరానికి మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది గాబా అనే ఒక న్యూరో ట్రాన్స్‌మిటర్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీంతో నాడీ మండల వ్యవస్థ ప్రశాంతంగా మారుతుంది. దీని వల్ల నిద్ర వస్తుంది. పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు. కనుక రోజూ రాత్రి గుమ్మడికాయ విత్తనాలను తింటే మంచిది. ఉదయం వీటిని నానబెట్టి అదే రోజు రాత్రి వీటిని తింటే మేలు జరుగుతుంది.
పెరుగు, బాదంపప్పు..
ఇక రాత్రి పూట భోజనంలో భాగంగా పెరుగును తీసుకోవాలి. కొందరు రాత్రి పూట పెరుగును తినరు. కానీ పెరుగును తింటే చక్కగా నిద్ర పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పెరుగులో గాబా అనే అమైనో యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. పడుకున్న వెంటనే నాడీ మండల వ్యవస్థను ప్రశాంతంగా మారుస్తుంది. దీంతో నిద్ర గాఢంగా వస్తుంది. కాబట్టి రాత్రి పూట పెరుగును తినాలని సూచిస్తున్నారు. దీంతోపాటు బాదంపప్పు వంటి నట్స్‌ను కూడా రాత్రి పూట తినవచ్చని, వీటితో మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుందని, ఇది నిద్రను ప్రోత్సహిస్తుందని సైంటిస్టులు అంటున్నారు. కనుక నిద్ర తక్కువవుతుందని భావించే వారు ఈ ఆహారాలను తింటే మేలు జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.