ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని భాగాలు సక్రమంగా పని చేయాలి. అయితే అన్ని భాగాలకు రక్తం సరఫరా సక్రమంగా ఉన్నప్పుడే ఇది సాధ్యం అవుతుంది. రక్తంలో కూడా టాక్సిన్స్ పేరుకుపోతాయి. వింతగా అనిపించినా ఇది నిజం. అవును.. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అంతేకాకుండా ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, హార్మోన్లను కూడా రక్తం రవాణా చేస్తుంది. ఇది శరీర pH సమతుల్యతను కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. అందువల్ల రక్తం సరిగ్గా శుద్ధి చేయకపోతే, ఇక్కడ నుంచి వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి. చర్మం, మూత్రపిండాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులలో వివిధ సమస్యలు వస్తాయి. రక్తం నుంచి విషాన్ని తొలగించడానికి తగినన్ని నీళ్లు తాగడంతోపాటు కొన్ని ముఖ్య ఆహారాలు కూడా తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తాయి.
నిమ్మరసం
నిమ్మరసం రక్తం, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలోని ఆమ్ల గుణాలు శరీరంలోని pH స్థాయిని సమతుల్యం చేస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగవచ్చు.
బీట్‌రూట్ జ్యూస్
బీట్‌రూట్ బ్లడ్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఈ దుంపలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, రక్తాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా ఇది రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
పసుపు
పసుపు మన దేశంలోని దాదాపు ప్రతి ఇంటి వంటకంలో కనిపిస్తుంది. పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడుతుంది. కాలేయ పనితీరును పెంచుతుంది. పాలలో పసుపు కలిపి తాగవచ్చు. అంతేకాకుండా రోజువారీ వంటలో పసుపు వేసినా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
వెల్లుల్లి
నోటి దుర్వాసన వస్తుందనే భయంతో చాలా మంది పచ్చి వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. కానీ వెల్లుల్లి కాలేయం, రక్తాన్ని నిర్విషీకరణ చేయడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు రక్తాన్ని శుద్ధి చేయడంతోపాటు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ అన్నంలో పచ్చి వెల్లుల్లిని తినవచ్చు.
బ్రోకలీ
బ్రోకలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కూరగాయలలో క్యాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, పొటాషియం, మాంగనీస్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.