ఏపీ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు(శనివారం) విచారణకు హాజరు కానున్నారు. గతంలో ఒకసారి లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరైన విజసాయిరెడ్డిని మరోసారి విచారించనున్నారు.
ఈ క్రమంలో ఇవాళ ఉదయం 10 గంటలకు సిట్ ఆఫీసుకు రావాలని నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో.. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘అన్ని రాజకీయ పార్టీలు రాజధర్మాన్ని అనుసరించాలి’ అని పేర్కొన్నారు.
అలాగే ” కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు.. కానీ వాని ఫలితములు మీద లేదు. నీవు కర్మ ఫలములకు కారణం కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు” అంటూ భగవద్గీతలోని శ్లోకాలన్ని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. అయితే.. ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్న తరుణంలో ఈ విధంగా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్ కు ఇచ్చినట్లు విజసాయిరెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
































