రాష్ట్ర రాజకీయాల్లో అమరావతి మహిళలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అమరావతి రాజధాని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో కృష్ణంరాజు తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆందోళనలు చేపట్టారు. అనంతరం రాజధాని మహిళలు గుంటూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో తాజాగా రాజధాని అమరావతి మహిళల మనోభావాలు దెబ్బతినేలా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ తరుణంలో రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతుల గురించి కొందరు నోళ్లు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి, హేయమైనవి అన్నారు. సభ్యసమాజం సహించలేనివని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ”కేవలం ఒక్క ఎకరా భూమి ఉన్న రైతులు సైతం రాజధాని కోసం భూములు ఇవ్వడమే గాక, తదనంతర కాలంలో తమ మీద జరిగిన దమనకాండకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారు. అమరావతి ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి, ప్రవృత్తిగా జీవనం సాగిస్తూ.. భవిష్యత్ తరాల కోసం వారు చేసిన త్యాగాలు నిరుపమానమైనవి. అలాంటి రైతులను, ముఖ్యంగా మహిళా మూర్తులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కిరాతకమైనవి. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం. ఇందుకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి” అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
































