మహిళలకు ఉచిత బస్సుకు ముహుర్తం ఫిక్స్

www.mannamweb.com


ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ మాత్రం ఇప్పటివరకూ అమలు కాలేదు. దీనిపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి వచ్చారు.

ఆ వివరాలను ఇవాళ మరోసారి సీఎం చంద్రబాబుతో అధికారులు చర్చించారు. ఇందులో ఎప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించాలన్న దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం.

ఏపీలో కూటమి సర్కార్ సూపర్-6లో భాగంగా మరో హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డితో ఇవాళ సీఎం చంద్రబాబు చర్చించారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ పథకంలో మరికొన్ని అంశాలపై అధ్యయనం చేసి వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు సాధ్యాసాధ్యాలపై పలు మార్లు చర్చలు నిర్వహించిన సీఎం చంద్రబాబు అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. అయితే ఈ పథకం అమలు చేస్తున్న కర్నాటక, తెలంగాణ, ఢిల్లీలో అమలు విధానంపై పలు అనుమానాలు ఉండటంతో వాటిని నివృత్తి చేసుకుని రావాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. అయితే ఉగాది నుంచి అమలుకు మాత్రం సిద్ధం కావాలని చంద్రబాబు ఇవాళ అధికారులకు తేల్చిచెప్పేశారు. దీంతో అధికారులు ఆ లోపు ఇతర రాష్ట్రాల రిపోర్టు తీసుకుని చంద్రబాబుకు అందించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాల సంఖ్య తక్కువగానే ఉంది. గతంలో వైసీపీ అమలు చేసిన పలు పథకాలకు కూటమి సర్కార్ ఇప్పటికే మంగళం పాడేసింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చని భావిస్తోంది. అందుకే ఉగాది నుంచి ఈ పథకం అమలుకు సిద్దం కావాలని అధికారులకు చంద్రబాబు ధీమాగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.