ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా సాగిపోతోంది. ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రతీ రోజూ లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని మరింత పక్కాగా అమలు చేసేందుకు వీలుగా ఏం చేయాలనే దానిపై సీఎం చంద్రబాబు ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు.. స్త్రీ శక్తి పథకం అమలు ఎలా జరుగుతుందని ఆరా తీశారు. ఆక్యుపెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందని అడిగారు. స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? అని ప్రశ్నించారు. దీనికి స్పందనగా అధికారులు స్త్రీ శక్తి పథకం అమలు మొదలయ్యాక ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందన్నారు. గతంలో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతంగా ఉండేదని.. ఇప్పుడు 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోందన్నారు.
అలాగే 13 జిల్లాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బందులు.. గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని అధికారులు సీఎంకు తెలిపారు. ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని, అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
స్త్రీ శక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుకా, ముందు బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సీట్లకోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలన్నారు. ఇప్పటి వరకు ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తలేదని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఈ పథకం ప్రారంభానికి ముందు 40 శాతం మహిళలు ప్రయాణిస్తే.. 60 శాతం మంది పురుషులు ప్రయాణించే వారని.. ఇప్పుడు 65 శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే.. 35 శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు.
రెండు, మూడు రోజుల్లో గుంటూరు డిపోలో స్త్రీ శక్తి బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపడతామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరిస్తామన్నారు. లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే బస్సుల వేళలు తెలుసుకుని ఆ మేరకు తమ ప్రయాణ సమయాలను మహిళలు ఫిక్స్ చేసుకుంటారని సీఎం తెలిపారు.
































