జిల్లాలకే ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు భారీ షాకిచ్చిన సీఎం చంద్రబాబు

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా సీఎం చంద్రబాబు మాత్రం భారీ బాంబు పేల్చారు. మహిళలకు ఉచిత బస్సు రాష్ట్రవ్యాప్తంగా కాదని..


కేవలం జిల్లాలకు పరిమితం అని ప్రకటించారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు.. దాని పరిమితిపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఉచిత బస్సు జిల్లాకే పరిమితమని సీఎం చంద్రబాబు ప్రకటించడం కలకలం రేపింది.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఏపీలో ఉచిత బస్సుపై పై ప్రకటన చేశారు. ‘పోలవరం ఏపీకి పెద్ద వరం. సముద్రంలోకి ప్రతి ఏడాది 2 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి. వాటిని ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 150 నుంచి 200 టీఎంసీలు వాడుకోవచ్చు. సముద్రంలోకి వెళ్లే నీరు వాడుకుంటే తప్పులేదు’ అని ప్రకటించారు.

‘రాయలసీమ అభివృద్ధికి నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది’ అని చంద్రబాబు తెలిపారు. ‘ఏపీలో అన్ని రోడ్లు బాగుంటాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాయలసీమ ఒకప్పుడు రాళ్లసీమ ఇప్పుడు కాదని ప్రకటించారు. రాయలసీమా హర్టికల్చర్ హబ్‌గా మారుస్తున్నాం. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ వస్తుంది.. టూరిజం వస్తుంది. ఎక్కడ ఏమి చేయాలో నాకు స్పష్టత ఉంది’ అని స్పష్టం చేశారు. పర్యాటక కేంద్రాలు, ఆలయాలు మనకు ఆస్తులని తెలిపారు. కడప దర్గా, తిరుపతి, శ్రీశైలం వంటి క్షేత్రాలు ఉన్నాయని.. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు అని అభివర్ణించారు.

‘రిజర్వాయర్లను దేవాలయంగా భావిస్తా. జీవితానికి సంపద ఇచ్చేది జలాశయాలు. టీడీపీ హయాంలోనే మెజారిటీ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించాం. కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి. కృష్ణా కి నీళ్లు రాకపోయినా గోదావరి నుంచి బనకచర్లకు నీరు తెస్తే కరువు ఉండదు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం’ అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ‘554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిల్వ ఉన్నాయ. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయి’ అని తెలిపారు.

‘సూపర్ సిక్స్‌ హామీలు అమలు చేస్తా. సంక్షేమం , అభివృద్ధి రెండు కళ్లు అని చెప్పా. అదే చేస్తున్నా. వేరే పార్టీకి, టీడీపీకి తేడా చూడాలి. ఐదేళ్లలో పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలు చేశా. పింఛన్ వెయ్యి పెంచడానికి గత ప్రభుత్వం ఐదేళ్లు తీసుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పింఛన్ ఇచ్చింది మేమే’ అని చంద్రబాబు ప్రకటించుకున్నారు. ‘భూగర్భ జలాలు పరిరక్షించాలి. అప్పుడు కరువు అనే మాట ఉండదు. 100 శాతం రాయితీతో సోలార్ పంపు సెట్లు. ఇంటికి సోలార్ పెట్టుకుంటే ఎన్నో ప్రయోజనాలు’ అని వివరించారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఏపీ ప్రజల తరఫున శ్రీశైలం మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు వెల్లడించారు. ఏ ప్రభుత్వం వల్ల జీవితాలు బాగుపడతాయో వారికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.