ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. నియోజకవర్గంలోని రెండు కీలక ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ బస్సుల్లో ఇలా నియోజకవర్గం ప్రజలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో మంగళగిరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో ఇవాళ జెండా ఊపి ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మంత్రి లోకేష్.. మెగా ఇంజనీరింగ్ సంస్థను ఒప్పించి CSR నిధుల నుంచి బస్సులను సమకూరేలా చేశారు. దీంతో మెగా సంస్థ 2.4కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఒలెక్ట్రా 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను ఇచ్చింది.
ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు నడుస్తుంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు నడుస్తుంది. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు, పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7నుంచి రాత్రి 8గంటల వరకు ప్రయాణీకులకు ఉచితంగా సేవలందిస్తుంది.
ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఒకసారి ఛార్జీతో 150 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఈ బస్సులు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ , రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్, రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి.
































