ఏపీలో రేపటి నుంచి వారికి ఉచిత విద్యుత్!

 ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది.


అందులో భాగంగా ఈనెల 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనుంది. ఇందుకు సంబంధించి ఏపీ క్యాబినెట్లో సైతం ఈ అంశం చర్చించింది. పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకంటే ముందే మరో ఎన్నికల హామీని అమలు చేయాలని భావించింది. రేపు దానికి ముహూర్తంగా నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆ రంగానికి చెందిన వారికి గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి కొత్త పథకం అమలులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా చేనేత కార్మికులు ఎదురుచూస్తుండగా.. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

* వృత్తి గిట్టుబాటు కాక..
చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేనేత గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు అడుగులు వేశారు. తాము అధికారంలోకి వస్తే నేతన్నలను ఆదుకుంటామని చంద్రబాబు( CM Chandrababu ) హామీ ఇచ్చారు. అందుకే ఇప్పుడు వారి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై నుంచి హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీని సర్కారే భరించేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. మగ్గాలకు 200, పవర్లూమ్స్ కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. నేతన్నల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రేపు జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. తక్షణం కార్యాచరణ ప్రారంభించాలని ఉన్నత స్థాయి సమీక్షలు ఆదేశించారు సీఎం చంద్రబాబు.

తగ్గిన ఆదరణరెడీమేడ్( readymade) వస్త్ర పరిశ్రమలు వచ్చిన తర్వాత చేనేత రంగానికి ఆదరణ తగ్గింది. యంత్రాలతో తయారు చేసిన వస్త్రాలు సైతం చేనేతగా చలామణి అవుతూ వచ్చాయి. దీంతో చేనేత కార్మికులకు ఉపాధి తగ్గింది. ఈ తరుణంలో చాలామంది ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు వెళ్లిపోయారు. అయితే పూర్వీకుల నాటి వృత్తిని వదులుకోలేక చాలామంది చేనేత రంగం పైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు చేనేత రంగాన్ని ఆదుకుంటామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేయనున్నారు. ఈ ఉచిత విద్యుత్తుకు సంబంధించి నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మగ్గాలు, 15 వేల మరమగ్గాలు కలిగిన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 93 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని ఒక అంచనా.

తప్పనున్న విద్యుత్ భారం..
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 6000 నుంచి 9000 వరకు విద్యుత్ భారం తప్పనుంది. ఒకవేళ 200 యూనిట్ల కంటే అధికం వాడినా.. ఆ 200 యూనిట్ల భారం ప్రభుత్వమే భరిస్తుంది. అదనంగా వాడిన యూనిట్లకు మాత్రం చేనేత కార్మికులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా మరమగ్గాలు లేని వారు 180 వరకు యూనిట్లు వినియోగిస్తుంటారు. అటువంటి వారికి ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఉపశమనం ఇస్తుంది. మరోవైపు జీఎస్టీకి సంబంధించి మినహాయింపు ఇవ్వడంతో కూడా చేనేత కార్మికులు నష్టాలనుంచి బయటపడతారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ తో పాటు రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.