ఉచిత సిలిండర్ బుక్ చేసేవారిని టార్గెట్ చేసే ముఠాలు ఏపీలో తిరుగుతున్నాయి. ఎవరైనా సిలిండ్ బుక్ చేశారంటే.. ఆ విషయాన్ని కనిపెట్టి.. ఈ ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి.
ఇదే విధంగా చేసిన ఓ ముసలాయన.. బంగారు నగలు, ఏటీఎం కార్డును పోగొట్టుకున్నాడు.
తిరుపతిలోని.. పాకాల రామానాయుడు కాలనీలో ఉంటున్నాడు శంకర్‌నాయుడు. ఆ ఇంటికి గ్యాస్ డెలివరీ బాయ్ డ్రెస్‌లో వచ్చిన ఓ వ్యక్తి.. “పెద్దాయనా, నీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆటో ఇక్కడికి రాదు. నువ్వే వెళ్లి, బండి దగ్గర మావోడు ఉన్నాడు. అడిగి తీసుకో. డబ్బులు మావోడికి చెల్లించు. బండ ఇస్తాడు” అని చెప్పాడు.
“నువ్వు బండ తెచ్చేవరకూ ఇక్కడే ఉంటా. త్వరగా వెళ్లి తెచ్చుకో. బండ తెచ్చాక, ఓటీపీ వస్తుంది, అది నాకు చెప్పాలి” అని అన్నాడు. అది నిజమే అనుకున్న పెద్దాయన.. బండకు మనీ ఇచ్చేందుకు బీరువా తాళం ఓపెన్ చేసి.. మనీ తీసుకున్నాడు. బీరువా తలుపులు వేసి.. హడావుడిగా వీధి చివరకు వెళ్లాడు.
ముసలాయన అలా సందు చివరకు వెళ్లగానే.. ఇలా ఆ దొంగ.. ఇంట్లోకి వెళ్లి.. బీరువాలో మూడున్నర సవర్ల నల్లపూసల దండ, ఆరు సవర్ల బంగారు గాజులు, 10 గ్రాముల గోల్డ్ చైన్, 70 గ్రాముల బంగారు నగలు, 10 గ్రాముల వెండి బ్రాస్‌లెట్‌తో పాటు ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ బుక్ తీసుకొని పారిపోయాడు.
వీధి చివరకు వెళ్లిన శంకర్ నాయుడికి అక్కడ ఏ ఆటో కనిపించలేదు. అయోమయంతో ఇంటికి తిరిగొచ్చాడు. బీరువా తలుపులు తెరచి ఉండటం చూసి అవాక్కయ్యాడు. దగ్గరకు వెళ్లి చూస్తే.. అసలు విషయం అర్థమైంది. చుట్టుపక్కల వాళ్లకు చెప్పినా.. అక్కడ ఎక్కడా ఆ దొంగ కనిపించలేదు.
మోసపోయిన పెద్దాయన.. తన కూతురికి కాల్ చేసి విషయం చెప్పాడు. తర్వాత విషయం పోలీసులకు తెలిసింది. కేసు రాసిన పోలీసులు.. ఆ దొంగ కోసం వెతుకుతున్నారు.
ఇలా ఏపీలో అతి తెలివి దొంగలు తిరుగుతున్నారు. వీరు జనాన్ని ఎలా బురిడీ కొట్టిద్దామా అని చూస్తున్నారు. ఉచిత వంటగ్యాస్ సిలిండర్ పథకాన్ని అడ్డం పెట్టుకొని.. మోసాలకు పాల్పడుతున్నారు. ఉచిత సిలిండర్ పేరుతో ఇంటికి వచ్చే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వారు నిజంగా గ్యాస్ ఏజెన్సీ సిబ్బందా కాదా అన్నది గమనించాలి. లేదంటే.. ప్రమాదమే.