దీపావళి నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

www.mannamweb.com


మహిళలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వందరోజుల్లో సాధించిన ప్రగతి.. భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్దాం. కోట్లమంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు తావులేకుండా ఉండాలి. అలాగని తప్పులు చేసినవారిని ఉపేక్షించం. చట్టప్రకారం వారిపై చర్యలు ఉంటాయి’’ అని ఎన్డీయే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు చేకూరిన లబ్ధిని ఈ నెల 20 నుంచి ఆరురోజుల పాటు వివరించాలన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసే విషప్రచారాలను తిప్పికొట్టేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు.

సమన్వయంతో పనిచేద్దాం
ఎన్నికల ముందు.. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లో మూడు పార్టీల సమన్వయం అమోఘంగా ఉందని చంద్రబాబు ప్రశంసించారు. ఇదే సమన్వయం నియోజకవర్గ స్థాయిలో కూడా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉందన్నారు. ‘‘దీని కోసం త్వరలో ప్లానింగ్‌బోర్డు మంత్రిని నియమిస్తాం. తెదేపా, జనసేన, భాజపాలను ఆయన సమన్వయం చేస్తారు. ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కీలకంగా వ్యవహరించాలి. అందరి సమన్వయంతో వంద రోజుల్లో వెయ్యి అడుగులు ముందుకెళ్లాం. రాబోయే రోజుల్లో అడుగుల వేగం ఇంకా పెరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు ప్రతి నెలా 10రోజుల పాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

రాష్ట్రాభివృద్ధికి.. కేంద్ర పథకాలతో సమన్వయం
‘‘ప్రధాని మోదీ ‘వికసిత్‌ భారత్‌ 2047’ లక్ష్యాలతో పనిచేస్తున్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేలా వివిధ పథకాలను కేంద్రం అమలుచేయనుంది. వాటిని అందిపుచ్చుకుని ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌ డాక్యుమెంట్‌ను 15% వృద్ధిరేటు లక్ష్యంతో రాష్ట్రస్థాయిలో రూపొందిస్తున్నాం. నియోజకవర్గ స్థాయిలో విజన్‌ డాక్యుమెంట్ల తయారీపై ఎమ్మెల్యేలు ఆలోచించాలి. జలజీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికీ కుళాయి నీరు కేంద్ర భాగస్వామ్యంతో అందిస్తాం. రాష్ట్ర రహదారులపై గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిర్వహిస్తాం. ఆ తర్వాత రోడ్ల అభివృద్ధికి శాశ్వత పరిష్కారంపై ఆలోచిస్తాం. ఒకేరోజు అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి రూ.4,500 కోట్లతో పనులను గుర్తించడం ఒక రికార్డు. ఈ పనులను కేంద్ర భాగస్వామ్య పథకాల అనుసంధానం ద్వారా పూర్తిచేస్తాం.

గ్రీన్‌ ఎనర్జీ రంగం.. కేంద్ర ప్రాధాన్య ప్రాజెక్టు
కేంద్రం గ్రీన్‌ ఎనర్జీ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. దీన్ని అందిపుచ్చుకునేలా ఆ రంగంలో 72 గిగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటిద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు.. 7.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. గతంలో ఐటీ రంగాన్ని ప్రాధాన్యంగా గుర్తించినట్లే.. ఇప్పుడు గ్రీన్‌ ఎనర్జీపై దృష్టిపెట్టాం.

తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకం పదార్థాలు
గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదం తయారీలో నాసిరకం పదార్థాలను వాడారు. వేంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే స్వచ్ఛమైన నేతినే వాడాలని చెప్పాం. ప్రసాదాల నాణ్యత పెంచాం.

వరద బాధితులకు అత్యధిక పరిహారం
వరద బాధితులకు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత అత్యధిక పరిహారాన్ని ప్రకటించాం. బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాలు సీఎం సహాయనిధికి రూ.350 కోట్ల విరాళాలను అందించాయి. ఎన్డీయే ఎమ్మెల్యేలు కూడా ఒకనెల జీతాన్ని సీఎం సహాయనిధికి విరాళంగా ఇద్దాం. గత ప్రభుత్వం విపత్తుల నిధిలో రూ.2000 కోట్లు ఉన్నట్లు లెక్కల్లో చూపింది. నిధులు మొత్తం ఖాళీచేసింది.

ప్రతినెలా మొదటిరోజు ‘పేదల సేవ’
వాలంటీర్లు లేకుండా పింఛన్లు పంపిణీ చేయడం అసాధ్యమని వైకాపా చెప్పింది. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి ఒకేరోజు రికార్డుస్థాయిలో పింఛన్ల పంపిణీ పూర్తిచేశాం. ప్రతినెలా ఒకటో తేదీ పేదల సేవ పేరుతో పింఛన్ల పంపిణీలో ప్రతి ఒక్కరూ నిమగ్నం కావాలి.

ఇసుక అక్రమాలకు పాల్పడొద్దు
ఇసుక సరఫరాలో పారదర్శకంగా ఉందాం. గత ప్రభుత్వం ఇసుక మాఫియాను ప్రోత్సహించిందని మనమే ఆరోపించాం. అలాంటి అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకండి. ఇసుక వ్యవహారంలో నేతలెవరూ జోక్యం చేసుకోకండి. ఈ విషయంలో పారదర్శకంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు బాటకు దోహద మవుతుంది.

అభివృద్ధి దిశగా అడుగులు
గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిలిచిపోయి రాష్ట్ర తలసరి ఆదాయం దారుణంగా పడిపోయింది. కేంద్రప్రభుత్వ భాగస్వామ్యంతో మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం. పోలవరానికి కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చింది. అమరావతికి రూ.15వేల కోట్లు ఇస్తుంది. గత వందరోజుల్లో శ్రీసిటీలో 15 సంస్థలను ప్రారంభించి.. 6 కంపెనీలకు శంకుస్థాపన చేశాం. సుమారు రూ.75వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపాయి. విశాఖలో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీ ఆసక్తి చూపుతోంది. త్వరలో ఆ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం.

వాలంటీర్ల పదవీ కాలం ముగిసి ఏడాది
జగన్‌ గొప్పగా చెప్పుకొనే వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసింది. వారి ఒప్పందాన్ని గత ప్రభుత్వం పునరుద్ధరించలేదు. ఎన్నికలకు ముందు తాత్కాలికంగా 3 నెలల జీతాలను చెల్లించింది. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారు. మిగిలినవారి పదవీకాలం ముగిసింది. గత ప్రభుత్వం 4లక్షల మందికి ప్రతి నెలా రూ.200 చొప్పున ఇచ్చి సాక్షి పత్రిక కొనుగోలు చేయించింది. ఇలా రూ.205 కోట్లు ఖర్చుచేసింది.

ధాన్యం రైతులకు 48 గంటల్లో చెల్లింపు
గత ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి పెట్టిన రూ.1,670 కోట్ల బకాయిలను మేం చెల్లించాం. ఇకమీదట రైతు నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లో చెల్లిస్తాం. రైతులకు బిందుసేద్యం పరికరాలను 90 శాతం రాయితీతో అందించే పథకాన్ని పునరుద్ధరించాం.

విశాఖ స్టీల్‌ప్లాంటు విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వ నిర్వహణలో ఉంచేలా చర్యలు తీసుకుంటాం. విశాఖ రైల్వేజోన్‌కు అవసరమైన భూములను అందించాం. త్వరలో కేంద్రమంత్రి శంకుస్థాపన చేస్తారు.
పోలీసుశాఖను ప్రక్షాళన చేస్తున్నాం. వారిలో జవాబుదారీతనాన్ని తెస్తున్నాం. గత ఐదేళ్లలో తప్పుడు కేసులు పెట్టి వేధించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేశారు. దీనికి ముంబయి సినీనటి అరెస్టు వ్యవహారమే నిదర్శనం. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలను ఏడు శ్వేతపత్రాల ద్వారా ప్రజల ముందుకు తెచ్చాం’’ అని చంద్రబాబు తెలిపారు.