ఈనెల 23న ఏపీ కేబినెట్ భేటీ – అంజెడాలో ఉచిత గ్యాస్ స్కీమ్ తో పాటు మరికొన్ని కీలక అంశాలు..!

www.mannamweb.com


ఏపీ కేబినెట్ అక్టోబర్ 23వ తేదీన భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. సూపర్ సిక్స్ పథకంలోని ఉచిత గ్యాస్ స్కీమ్ తో పాటు దేవదాయ శాఖకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23వ తేదీన భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. అక్టోబర్ 16వ తేదీన జరిగిన సమావేశంలో… పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఇదిలా ఉంటే… తాజాగా మరోసారి మంత్రివర్గం భేటీ కానుంది. అక్టోబర్ 23వ తేదీన జరిగే సమావేశంలో… మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది. అంతేకాకుండా… దేవదాయ శాఖకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ నేపథ్యంలో అన్ని శాఖలు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

దీపావ‌ళికి సూప‌ర్ సిక్స్‌లో భాగ‌మైన మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు అమ‌లు చేస్తామ‌ని ఇప్ప‌టికే క‌ర్నూలు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. క‌నుక రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశంలో మ‌హిళ‌ల‌కు ఉచిత గ్యాస్ అంశంపై ఒక నిర్ణ‌యం తీసుకోనే అవకాశం ఉందని తెలుస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం, రాజ‌ధాని అమ‌రావ‌తి పునఃనిర్మాణం వంటి అంశాల‌పై రాష్ట్ర మంత్రి వ‌ర్గంలో చ‌ర్చ జ‌ర‌గే అవకాశం ఉంది.
కీలక అంశాలపై చర్చ…!

రాష్ట్రంలోని 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించవచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపైనా ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మరికొన్ని కీలక నిర్ణయాలు ఉండొచ్చని సమాచారం.

రాష్ట్ర శాసనసభ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 23న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 6 వేల రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనిపై ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
నవంబర్ లో ఏపీ బడ్జెట్:

మరోవైపు నవంబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌.. బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

నవంబర్ రెండో వారంలో సమావేశాలు నిర్వహించి.. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మూడు ప్రాజెక్టులకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం ఉంది.