డాబా ఇల్లు నిర్మించి ఇస్తానని జులైలో పాములు నాయక్‌కు హామీ పత్రం ఇస్తున్న సీఎం చంద్రబాబు
తాడేపల్లి, న్యూస్‌టుడే: పూరి గుడిసెలో ఉన్న ఓ కుటుంబాన్ని చూసి చలించిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు..
డాబా ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చి ఆరు నెలలు తిరక్కుండానే ఆ కుటుంబాన్ని డాబా ఇంటికి యజమానులను చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఈ ఏడాది జులై ఒకటో తేదీన చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో పూరి గుడిసెలో నివాసం ఉంటున్న బాణావత్ పాములు నాయక్, సీతమ్మ దంపతుల ఇంటికి వెళ్లి పింఛను అందించారు. వారు గుడిసెలో నివాసం ఉండటానికి గల కారణాలను అడిగి తెలుసుకుని సీఎం చలించిపోయారు. డాబా కట్టించి ఇస్తానని హామీ ఇచ్చి మంజూరు పత్రాన్నీ అందజేశారు. తాజాగా ప్రభుత్వం డాబా నిర్మించి ఇవ్వడంతో జనవరి మొదటి వారంలో దిగేందుకు గృహప్రవేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా పాములు కుటుంబం హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, మంత్రి లోకేశ్‌కి రుణపడి ఉంటామని తెలిపింది.